
F3: ఇటు నవ్వులు.. అటు పంచ్‌లు
‘‘ఎఫ్2’లో ఫన్, ఫ్రస్ట్రేషన్‌ను రుచి చూపించి సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు వెంకటేష్, వరుణ్ తేజ్. ఇప్పుడీ హీరోలిద్దరూ ‘ఎఫ్3’తో వినోదాలు పంచిచ్చేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘ఎఫ్2’ సినిమాకి కొనసాగింపుగా రూపొందుతోంది. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం వరుణ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వరుణ్ రూ.2వేల నోటు పట్టుకుని.. స్టైలిష్‌గా స్టెప్పేస్తూ కనిపించారు. ‘‘డబ్బు చుట్టూ తిరిగే వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. తొలి భాగంతో పోల్చితే.. అంతకు మూడు రెట్ల వినోదం కనిపిస్తుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇది వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని ఒకరోజు ముందుగానే ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు.
‘గని’.. పవర్ పంచ్
వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటించిన చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు బాబి, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ ఆట చుట్టూ తిరిగే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందింది. బుధవారం వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘పవర్ ఆఫ్ గని’ పేరుతో చిన్న వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో బాక్సర్ గనిగా వరుణ్‌తేజ్‌ను ఆసక్తికరంగా చూపించారు. సునీల్ శెట్టి శిక్షణలో బాక్సర్‌గా ఆయన రాటుదేలిన తీరును, బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులకు తన పంచ్ పవర్ రుచి చూపిస్తున్న విధానాన్ని ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమా మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.