Published : 26 May 2022 02:07 IST

‘జైత్ర’యాత్ర

సన్నీ నవీన్‌, రోహిణి రేచల్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘జైత్ర’. తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్‌ కొండేటి, అల్లం సుభాష్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘ఈ వేడుకకి నేను అతిథిగా రావడం గౌరవంగా భావిస్తున్నా. మల్లి నిజాయతీగా ఉంటాడు. ఈ సినిమాని కూడా అదే తరహాలో తీశాడని నమ్ముతున్నా. ఈ చిత్రంతో ఈ బృందం జైత్రయాత్ర సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారాయన. ‘‘జోడెద్దులు, నాలుగు ఎకరాలన్న ఓ భాగ్యవంతుడి కథ ఇది. ఊరు నుంచి వచ్చిన మట్టి మనిషి కథ. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్‌, ఎడిటర్‌ విప్లవ్‌ నైషదం, నిరంజన్‌, అక్సాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవీవీకి అంకితం

నాజర్‌, అంజలి, అనిత ప్రధాన పాత్రధారులుగా తమిళంలో తెరకెక్కిన ‘మహారాజా’ చిత్రాన్ని తెలుగులో ‘ముసలోడికి దసరా పండగ’ పేరుతో అనువదిస్తున్నారు. డి.మనోహర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రమణ ఫిలింస్‌ పతాకంపై రమణ వాళ్లె నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌, ట్రైలర్‌ని ఇటీవలే నాజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పాత్రని తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంటుంది. ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా స్వచ్ఛమైన వినోదంతో రూపొందిన చిత్రమిది. త్వరలోనే విడుదల చేస్తాం. ఈ చిత్రాన్ని నాకు పితృ సమానులైన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకి అంకితం ఇస్తున్నా’’ అన్నారు. కోవై సరళ, శరణ్య, సత్య తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: డి.ఇమాన్‌.


‘1947 ఆగస్టు 16’న..?

‘గజిని’, ‘తుపాకి’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. ఆయన నిర్మాతగానూ గతంలో పలు చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. పర్పుల్‌ బుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలతో కలిసి ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘ఆగస్టు 16, 1947’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది. గౌతమ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.ఎస్‌.పొన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా రేవతి నటిస్తోంది. స్వాతంత్య్రానంతరం జరిగిన పలు ఘటనల ఆధారంగా కథనం ఉండనున్నట్లు తెలుస్తోంది.


గడంగ్‌ రక్కమ్మ ఆటాపాటా..

‘హే బాగున్నారా అందరూ.. మీ కోసం నేను హాజరూ..’ అంటూ గడంగ్‌ రక్కమ్మగా వచ్చేసింది జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచరస్‌ చిత్రం ‘విక్రాంత్‌ రోణా’. అనూప్‌ భండారీ దర్శకుడు. జులై 28న విడుదల కానున్న ఈ చిత్రంలో నిరూప్‌ భండారీ, నీతా అశోక్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ‘రారా రక్కమ్మా..’ అంటూ సాగే ఈ హుషారైన గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. మంగ్లీ, నకాష్‌ అజీజ్‌ ఆలపించారు. ఈ పాటకు సుదీప్‌, జాక్వెలిన్‌ వేసే స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని సమాచారం. సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, ఛాయాగ్రహణం: విలియమ్‌ డేవిడ్‌.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని