Tollywood: ప్రేక్షకుల ఆదరణ.. మా కష్టాన్ని మరిపించింది

అభిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా దుర్గా ప్రసాద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పగ పగ పగ’. సత్య నారాయణ సుంకర, రామ్‌ సుంకర సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు కోటి ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది

Updated : 24 Sep 2022 14:06 IST

అభిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా దుర్గా ప్రసాద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పగ పగ పగ’ (Paga Paga Paga). సత్య నారాయణ సుంకర, రామ్‌ సుంకర సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు కోటి ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘మొదట ఈ సినిమాలోకి సంగీత దర్శకుడిగానే వచ్చాను. కానీ, చిత్ర బృందం ఇందులో నాతో ఓ పాత్ర కూడా చేయించింది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాన్ని ఇంకా పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ప్రేమ.. వినోదంతో పాటు మంచి కథతో రూపొందిన చిత్రమిది. మా ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు చిత్ర దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసి థియేటర్లలో ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. వారు చూపిస్తున్న ఆదరణతో ఇంతకాలం మేము పడిన కష్టమంతా మర్చిపోయాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అభిలాష్‌, కరాటే కల్యాణి, వాసు, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.


మెడికల్‌ మాఫియా కథతో

ధ్రువన్‌ కటకం, నియా త్రిపాఠీ జంటగా సత్య రాచకొండ తెరకెక్కించిన చిత్రం ‘బలమెవ్వడు’. ఆర్‌.బి.మార్కండేయులు నిర్మించారు. పృథ్విరాజ్‌, సుహాసిని, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబరు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు పృథ్వి మాట్లాడుతూ.. ‘‘మెడికల్‌ మాఫియా సామాన్యుల్ని ఎంతగా నలిపేస్తుంది.. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే అంశంతో ఈ చిత్రం రూపొందింది. సమాజానికి మంచి సందేశమిచ్చే ఇలాంటి చిత్రాలకు అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అన్నారు. ‘‘సందేశంతో పాటు ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన ప్రేమకథ, సున్నితమైన హాస్యం అన్నీ కలగలిపి తీసిన చిత్రమిది. మణిశర్మ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో ధ్రువన్‌, నియా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని