Tollywood: ‘జిలేబి’ మొదలు

సీనియర్‌ దర్శకుడు కె.విజయభాస్కర్‌ కొంత విరామం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిలేబి’. శ్రీకమల్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.

Updated : 07 Oct 2022 07:00 IST

సీనియర్‌ దర్శకుడు కె.విజయభాస్కర్‌ (Vijay Bhaskar) కొంత విరామం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిలేబి’ (Jilebi). శ్రీకమల్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. శివాని రాజశేఖర్‌ కథానాయిక. గుంటూరు రామకృష్ణ, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మాతలు. విజయ దశమి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్‌ క్లాప్‌నిచ్చారు. కథానాయకుడు రాజశేఖర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత స్రవంతి రవికిశోర్‌ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ అందజేశారు. ‘‘నేను చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమా రంగంలో అనుభవం ఉన్న నిర్మాతలతో కలిసి ప్రయాణం చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు కె.విజయభాస్కర్‌. రాజేంద్రప్రసాద్‌, మురళీశర్మ, గెటప్‌ శ్రీను, మిర్చికిరణ్‌, గుండు సుదర్శన్‌, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, కళ: సంపత్‌రావు, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ


బాబా జీవిత కథతో...

పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా జీవితం ఆధారంగా  ‘శ్రీసత్యసాయి అవతారం’ (SrisatyaSai Avataram) తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి సాయిప్రకాశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకి ఇది వందో చిత్రం కావడం విశేషం. సాయివేదిక్‌ ఫిలింస్‌ పతాకంపై  డా.దామోదర్‌ నిర్మిస్తున్నారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ సినిమాకి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి క్లాప్‌నివ్వగా, నిర్మాతలు కె.అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయికుమార్‌, సుమన్‌, బాబు మోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘బాబా వారికి 180 దేశాల్లో భక్తులు ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించడం కూడా ఆయన దయే అనేది నా అభిప్రాయం. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండని చెప్పేవారు బాబా. అందులో మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప విషయం ఇమిడి ఉంది. ఇందులో 400 మంది నటిస్తారు. నవంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అర్చన, కోట శంకర్రావు, అశోక్‌కుమార్‌, పృథ్వీ, శివపార్వతి, సహ నిర్మాత గోపీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని