K Viswanath: సునిశిత హాస్య స్రష్ట

కళా తపస్వి కె.విశ్వనాథ్‌ (K Viswanath) చిత్రాలంటే వీనుల విందైన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు.. వీటికి దీటుగా సాహితీ సౌరభాలు సహజసిద్ధంగా ఉంటాయి. అంతే కాదు.. సమపాళ్లలో దట్టించి పప్పులో ఉప్పులా కలిసిపోయిన సునిశిత హాస్యమూ ఉంటుంది.

Updated : 04 Feb 2023 06:47 IST

కళా తపస్వి కె.విశ్వనాథ్‌ (K Viswanath) చిత్రాలంటే వీనుల విందైన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు.. వీటికి దీటుగా సాహితీ సౌరభాలు సహజసిద్ధంగా ఉంటాయి. అంతే కాదు.. సమపాళ్లలో దట్టించి పప్పులో ఉప్పులా కలిసిపోయిన సునిశిత హాస్యమూ ఉంటుంది. ఈ హాస్యం కథలో భాగంగా ఉంటుందే కానీ, కథకు సంబంధం లేకుండా నేల విడిచి సాము చేయదు.

* విశ్వనాథ్‌కు దేశ, విదేశాల్లో ఖ్యాతిని ఆర్జించిపెట్టిన ‘శంకరాభరణం’ లాంటి సీరియస్‌ చిత్రంలోనూ అల్లు పాత్ర ద్వారా నవ్వులు పూయించారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే తన స్నేహితుడైన సంగీత సమ్రాట్టు శంకరశాస్త్రికి సన్మానం చేస్తామని కన్నడ సంఘం సెక్రటరీ వచ్చినపుడు అల్లు చేసే సిఫార్సు, శంకరశాస్త్రి ఉరిమి చూసినపుడల్లా తన భార్య కిలో మూడు రూపాయలతో మార్కెట్‌ నుంచి తెచ్చిన పుచ్చు వంకాయల ప్రస్తావన తీసుకురావడం ప్రేక్షకుణ్ని గిలిగింతలు పెట్టిస్తుంది. న్యాయవాది అయిన అల్లు వద్దకు ఓ క్లయింటు (నటుడు థమ్‌) కుటుంబ వివాదంతో రాగా, మాటల మధ్యలో భార్య లోపలి నుంచి పిలవడం అలా మాటిమాటికీ లోనికి వెళ్లి వస్తూ.. ‘ఆ చెప్పు నాయనా! మీ నాన్నకు ఇద్దరు పెళ్లాలా!’ అంటూ ఓమారు, ‘మీ అమ్మకు ఇద్దరు మొగుళ్లా!’ అంటూ మరోమారు.. ‘నీకు ఇద్దరు పెళ్లాలా!’ అంటూ మూడోమారు అల్లు కన్‌ఫ్యూజనుగా చెప్పేసరికి ఆయనకు ఓ దండం పెట్టి థమ్‌ విసురుగా వెళ్లిపోతాడు.

* మరో సీరియస్‌ చిత్రం ‘సప్తపది’లోనూ అల్లు పాత్ర ద్వారానే హాయిగా నవ్వులు పండించారు. గ్రామపెద్ద రాజు గారి పాత్ర పోషించిన అల్లు ఇంటికి ఆరో కుమార్తె పురుడు కోసం వస్తుంది. ఆ సమయంలో అల్లు భార్య సైతం నిండుగర్భంతో ఉంటుంది. తల్లీకూతుళ్లు ఎదురుపడి సిగ్గుపడిపోతూ ‘‘ఎన్నో నెల?’’ అని పరస్పరం కుశల ప్రశ్నలు అడుక్కోవడం, జాగ్రత్తలు చెప్పుకోవడం చూసి నవ్వకుండా ఉండగలమా! ఈ మాట తెలియకుండా వరండాలో కూర్చొన్న అల్లుడితో అసలు విషయం చెప్పలేక అల్లు సతమతం అవుతుంటాడు. ‘మీ అత్తగారిని అమ్మాయితో పురుడుకు పంపడం కుదరదయ్యా! ఎందుకంటే.. అందుకే మరి’ అంటూ అటు తిరుక్కొని ఇటి దూలానికి తాళం వేస్తూ అల్లు చెప్పిన తీరు చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తుంది.

* విశ్వనాథ్‌ తీసిన మరో శిఖర సమాన చిత్రం ‘సాగర సంగమం’లోనూ హాస్యం సమాంతరంగా సాగుతుంది. ‘ఇంటద్దె అడిగితే ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ ఇంటికి నోటీసు అంటించిన సుందోపసుందులు (కమల్‌హాసన్‌, శరత్‌బాబు) ఆ ఇంటి యజమాని థమ్‌తో బంతాట ఆడుకోవడం భలే సరదాగా ఉంటుంది. పనివాడు శివయ్య పాత్ర పోషించిన పొట్టి ప్రసాద్‌ను కమల్‌హాసన్‌ ‘తీర్థం’ (మద్యం) ఎక్కడ దొరుకుతుందో తెలుసా?’ అని అడిగినపుడు.. ‘‘తెలుసయ్యా! ఒక్క తీర్థం మాత్రమే కాదయ్యా! తీర్థం, పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా! తీర్థం, చక్కెర పొంగళి సాయంత్రం వైష్ణవాలయంలోనయ్యా!’ అని చెప్పిన సమాధానం ఫక్కున నవ్విస్తుంది.

జి.ఎస్‌.జమీర్‌ హుసేన్‌


* ఆస్కార్‌ నామినేషనుకు వెళ్లిన విశ్వనాథ్‌ చిత్రం ‘స్వాతిముత్యం’లో పిసినారి సుత్తి వీరభద్రరావును ఎంత తిట్టుకుంటామో, అంత నవ్వుకుంటాం. ఇంటికి వచ్చిన తండ్రి (మల్లికార్జునరావు)కి కుమార్తె (అనిత) ఫలహారం పెడుతుంది. ఇది చూసిన సుత్తి వీరభద్రరావు తన ఇంటి మీద పడి తింటున్నాడని మామను తిట్టిపోస్తాడు. అవమానంతో గోదాట్లో దూకి చనిపోతానని తండ్రి బయలుదేరగా.. ‘‘ఉండు నాన్నా! నీతోపాటు నేనూ చచ్చిపోతా’’ అని అనిత బయలుదేరబోతుంది. ఇదంతా చూస్తున్న అల్లుడు ‘‘ఆగు.. ఇదేం ఈతల పోటీ అనుకున్నారటే! ఒకళ్ల వెనకాల మరొకళ్లు దూకి చనిపోవటానికి? మీరెవరూ దూకి చావనక్కర్లేదు. ఇక్కడే బతికి చావండి.. నన్ను చంపండి’’ అంటూ మరోమారు తిట్టిపోస్తాడు.


‘‘చూడు నాయనా! ఇళ్లు కాలిపోయినవాళ్లను నువ్వు చూసి ఉంటావు. ఒళ్లు కాలిపోయినవాళ్లను చూసి ఉంటావు. పతిభక్తితో కాలిపోతున్నవాణ్ని చూశావా.. అది నేనే’’ అంటూ ‘స్వర్ణకమలం’లో సాక్షి రంగారావు పలికే సంభాషణలకు పడి పడి నవ్వుకుంటాం. ఈయన భార్య పాత్ర పోషించిన శ్రీలక్ష్మి సంతానభాగ్యం కోసం 24 గంటలూ అందరు దేవుళ్లను పూజిస్తూ ఆ హారతులు తీసుకువచ్చి భర్త ముఖాన్ని కుంపట్లో కాలిన కుమ్మొంకాయలా చేస్తూ ఉంటుంది. ఇంటి నిండా దేవుళ్ల పటాలే. అన్నీ నిత్య హారతులతో మసిబారి ఉంటాయి.


తకిట తధిమి తకిట తధిమి తందాన..

ఇది హాస్య సన్నివేశం కాదు. సున్నిత భావాలను కళాత్మకంగా చూపే విశ్వనాథ్‌ దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునక. ‘సాగరసంగమం’లో తప్ప తాగి పెరటి బావిపై బాలు (కమల్‌హాసన్‌) నృత్యం చేస్తుంటాడు. అతణ్ని కాపాడేందుకు తప్పనిసరై నుదుట బొట్టు పెట్టుకొని (భర్త చనిపోయి ఉంటాడు) వెళ్లి చేయి పట్టుకొంటుంది మాధవి (జయప్రద). చాన్నాళ్ల తర్వాత ఆమెను అక్కడ చూసిన బాలు నిర్ఘాంతపోతాడు. మాధవిని ఎప్పుడూ సుమంగళిగానే చూడాలని అనుకునే అతడు వర్షానికి కరిగిపోతున్న ఆమె బొట్టుకు తన అరచేయిని అడ్డుపెట్టి లోనికి తీసుకువెళతాడు. ఈ దృశ్యం ఆ చిత్రానికి ఆయువుపట్టు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని