Pareshan: కొత్త రకమైన కామెడీతో ‘పరేషాన్‌’

బుగ్గలు నొప్పి పెట్టేంతగా నవ్వించిన సినిమా ఇది అన్నారు కథానాయకుడు రానా దగ్గుబాటి. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.

Updated : 22 May 2023 14:10 IST

బుగ్గలు నొప్పి పెట్టేంతగా నవ్వించిన సినిమా ఇది అన్నారు కథానాయకుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఆయన సమర్పిస్తున్న చిత్రం ‘పరేషాన్‌’ (Pareshan). తిరువీర్‌, పావని కరణం జంటగా నటించారు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించారు. విశ్వతేజ్‌ రాచకొండ, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మాతలు. జూన్‌ 2న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రానా దగ్గుబాటి ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘యువ బృందం అంతా ప్రేమించి, ఎంతో ఉత్సాహంతో చేసిన సినిమా ఇది. నేనెక్కడున్నా సరే పరేషాన్‌ చేస్తూ ట్రైలర్‌ చూడండని కోరేవాడు తిరువీర్‌’’ అన్నారు. తిరువీర్‌ మాట్లాడుతూ ‘‘కొన్ని సినిమాలతో మనం బాగా కనెక్ట్‌ అయ్యి, మళ్లీ మళ్లీ చూస్తుంటాం. అలాంటి చిత్రమే ఇది. మంచిర్యాలలో పుట్టి పెరిగిన రూపక్‌ రొనాల్డ్‌సన్‌ అక్కడి కథని రాసుకుని ఈ సినిమా తీశారు. రానా దగ్గుబాటి సమర్పిస్తుండడం ప్రేక్షకులకు మరింత భరోసానిస్తుంది’’ అన్నారు. ‘‘కొత్త రకమైన కామెడీని పరిచయం చేద్దామనే ఆలోచనతోనే ‘పరేషాన్‌’ చేశాం. రానా దగ్గుబాటి ఎటువంటి లెక్కలు చూడకుండా మా సినిమాకి సహకారం అందించారు. తెలంగాణ మూలాల్లోని సహజమైన కథతో తెరకెక్కించాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘మా కష్టాన్ని మరిచిపోయేలా చేసిందీ చిత్రం. ఇలాంటి సినిమాలు తీయాలంటే నిర్మాతలకి ధైర్యం కావాలి. రానా అండ మాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. కొందరి జీవితాల్ని చూస్తున్నామనే అనుభూతితో సినిమాని ఆస్వాదిస్తార’’న్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీ, గీత రచయిత చంద్రమౌళి, పావని కరణం, సంగీత దర్శకుడు యశ్వంత్‌ నాగ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని