పేదల కోసం సోనూసూద్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ రియల్‌హీరో అనిపించుకున్న నటుడు సోనూ సూద్‌...మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు.

Published : 30 May 2023 00:38 IST

దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ రియల్‌హీరో అనిపించుకున్న నటుడు సోనూ సూద్‌...మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. పేద, అనాథ విద్యార్థుల కోసం ఆయన బిహార్‌లో ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభించనున్నారు. నిజానికి దీన్ని బిహార్‌కి చెందిన 27 ఏళ్ల ఇంజినీర్‌ బీరేంద్రకుమార్‌ మహతో ప్రారంభించారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఈ బడిని అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేశాడు. సోనూ సూద్‌పై అభిమానంతో పాఠశాలకు నటుడి పేరు పెట్టాడు. ప్రస్తుతం అందులో 110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్‌ బిహార్‌కి వెళ్లి మరీ మహతోని కలిశారు. అక్కడ మరింత మెరుగైన విద్య, వసతి, నాణ్యమైన ఆహారం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ మంది పిల్లలకు సరిపోయేలా, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్థాయిలో కొత్త భవనం నిర్మిస్తానని చెప్పారు. ఈమధ్యే పనులు సైతం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సోనూ సూద్‌ మాట్లాడుతూ.. ‘అణగారినవర్గాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే వారి పేదరికాన్ని తరిమేయగలుగుతాం. వాళ్లు బాగా చదువుకున్నప్పుడే మంచి ఉద్యోగాల్లో స్థిరపడగలుగుతారు. పేదల జీవితాల్లో మార్పు వస్తుంది’ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదివేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారు సోనూ సూద్‌. తన తల్లి పేరు మీద స్కాలర్‌షిప్‌లు సైతం ఇస్తానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని