అప్పుడూ ఇప్పుడూ కథ నచ్చే చేశా!

‘‘తొలి సినిమా ‘నాంది’ డబ్బు కంటే కూడా వెలకట్టలేని పేరు తీసుకొచ్చింది. నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

Updated : 30 May 2023 05:42 IST

‘‘తొలి సినిమా ‘నాంది’ డబ్బు కంటే కూడా వెలకట్టలేని పేరు తీసుకొచ్చింది. నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆ గుర్తింపుకి దీటుగానే ‘నేను స్టూడెంట్‌ సర్‌’ ఉంటుంద’’న్నారు సతీశ్‌ వర్మ. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సినిమాల్ని రూపొందిస్తున్న నిర్మాత ఆయన. తొలి ప్రయత్నంగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఆయన రెండో ప్రయత్నమే ‘నేను స్టూడెంట్‌ సర్‌’. బెల్లంకొండ గణేశ్‌ కథానాయకుడిగా నటించగా, రాకేశ్‌ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సతీశ్‌ వర్మ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘మార్కెట్‌... వసూళ్ల లెక్కల్ని చూసుకుని సినిమాలు చేయను. ‘నాంది’ కూడా అప్పట్లో కథ నచ్చి, మిగతావేవీ పట్టించుకోకుండా ధైర్యంగా చేసిన సినిమానే. ‘నేను స్టూడెంట్‌ సర్‌’ చేయడానికి కారణం కూడా  కథలోని కొత్తదనమే. ఒక మంచి థ్రిల్లర్‌గా అన్ని వయసులవారికీ నచ్చేలా ఉంటుంది. కథలోని మూడు ప్రధానమైన మలుపులు, పతాక సన్నివేశాలు  సినిమాకి కీలకం. ఓ విద్యార్థి జీవితం తెరపై కనిపిస్తుంది. అది అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఓ విద్యార్థి ఐ ఫోన్‌తో ముడిపడిన కథ ఇది. మనం తరచూ పత్రికల్లోనూ ఇలాంటి సంఘటనల గురించి చదువుతుంటాం. కానీ పట్టించుకోం. ఆ సంఘటన ఏమిటి? ఆ విషయాన్ని ఎంత థ్రిల్లింగ్‌గా చెప్పామనేది తెరపైనే చూడాలి’’.

‘‘పేరున్న దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవంతో రాకేశ్‌ చాలా బాగా తీశాడు. భాగ్యశ్రీ తన కూతురు అవంతికని కథానాయికగా పరిచయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడే మేం సంప్రదించాం. అలా తను ఇందులో కథానాయిగా నటించింది. మహతి స్వరసాగర్‌ మంచి సంగీతం ఇచ్చారు’’.

‘‘తదుపరి మా సంస్థలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ఓ కల్పిత బయోపిక్‌ సినిమాని చేస్తున్నాం. ఒలింపిక్స్‌ నేపథ్యంలో సాగే కథ అది. రాకేశ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుంది. ‘నాంది’కి కొనసాగింపు ఆలోచన కూడా ఉంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని