Sriranga Neethulu: మనందరి కథతో... ‘శ్రీరంగనీతులు’

మూడు కథలు... నలుగురి జీవితాలు...ఎవరి ప్రయాణం ఎలా సాగింది? ఏ కథ ఎలాంటి మలుపు తీసుకుందో తెలియాలంటే ‘శ్రీరంగనీతులు’ చూడాల్సిందే.

Updated : 30 Mar 2024 12:13 IST

మూడు కథలు... నలుగురి జీవితాలు...ఎవరి ప్రయాణం ఎలా సాగింది? ఏ కథ ఎలాంటి మలుపు తీసుకుందో తెలియాలంటే ‘శ్రీరంగనీతులు’ చూడాల్సిందే. సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు. ఏప్రిల్‌ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత ధీరజ్‌ మొగిలినేని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుహాస్‌ మాట్లాడుతూ ‘‘కథే నన్ను ఇందులో భాగం చేసింది. దర్శకుడు ప్రవీణ్‌ ప్రయాణం నాకు తెలుసు. చాలా కష్టపడి ఈ సినిమాని చేశాడు. మూడు కథల సంకలనంతో ఈ చిత్రం రూపొందింది. ప్రతి కథ హత్తుకుంటుంది. మంచి సినిమా చూస్తున్న అనుభూతిని పంచుతుంది. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా. నిర్మాత ఎంతో అభిరుచి కలిగిన వ్యక్తి. మంచి సినిమాని నిర్మించార’’న్నారు. విరాజ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి కథే హీరో. బస్తీ నుంచి బంగళా దాకా అందరికీ కనెక్ట్‌ అవుతుంది. నేను వరుణ్‌ పాత్రలో కనిపిస్తా. మా ‘బేబి’ ఫేం ధీరజ్‌ మొగిలినేని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నార’’న్నారు. కార్తీక్‌రత్నం మాట్లాడుతూ ‘‘నాకు నచ్చిన పాత్రని, నచ్చిన నటులతో కలిసి చేసే అవకాశాన్ని ఈ చిత్రం కల్పించింది. సినిమా చాలా బాగుంటుంది’’ అన్నారు. రుహానీశర్మ మాట్లాడుతూ ‘‘ఇది మంచి కథ, మనందరి కథ. ప్రతి ఒక్కరూ వాళ్లని వాళ్లు అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కథాబలం ఉన్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. దర్శకుడు మంచి అభిరుచితో చిత్రాన్ని తెరకెక్కించార’’న్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అజయ్‌ అరసాడతోపాటు శశాంక్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని