Good night review: రివ్యూ: గుడ్‌నైట్‌.. హీరో గురక.. ఎలాంటి సమస్యలు తెచ్చింది?

Good night review: ఓటీటీలో విడుదలైన తమిళ చిత్రం ‘గుడ్‌నైట్‌’ ఎలా ఉందంటే?

Published : 03 Jul 2023 15:43 IST

Good night review; చిత్రం: గుడ్‌నైట్‌; నటీనటులు: కె.మణికందన్‌, మీతా రఘునాథ్‌, రమేశ్‌ తిలక్‌, రేచల్‌ రెబకా, బాలాజీ శక్తివేల్‌, భగవతి పెరుమాళ్‌ తదితరులు; సంగీతం: సీన్‌ రోల్డన్‌; సినిమాటోగ్రఫీ: జయంత్‌ సేతుమాధవన్‌; ఎడిటింగ్‌: భారత్‌ విక్రమన్‌; నిర్మాత: యువరాజ్‌ గణేశన్‌, మహేశ్‌ రాజ్‌ పసిలన్‌, నజీరత్‌ పసిలన్‌; రచన, దర్శకత్వం: వినాయక్‌ చంద్రశేఖరన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

టీవల కాలంలో అన్ని భాషల్లోనూ చిన్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. హంగు, ఆర్భాటాలు లేకుండా సరికొత్త సబ్జెక్ట్‌లతో తక్కువ బడ్జెట్‌తో యువ దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా తాజాగా తమిళంలో విడుదలైన చిత్రమే ‘గుడ్‌నైట్‌’. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంతకీ ఈ చిత్ర కథేంటి? (Good Night Movie review in telugu) ఎవరికి ఎవరు ‘గుడ్‌నైట్‌’ చెబుతారు?

కథేంటంటే: మోహన్‌ (కె. మణికందన్‌) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మధ్య తరగతి కుటుంబం. అమ్మ,  అక్కా-బావ, చెల్లి అంతే. కానీ, అతడికి ఒక సమస్య. నిద్రపోయాడంటే భీకరమైన గురకపెడతాడు. ఎంతలా అంటే ఆ గురక సౌండ్‌కి పక్కంటివాళ్ల నిద్ర కూడా చెడిపోతుంది. మనవాడి నిద్ర గురించి తోటి స్నేహితులకు తెలిసి ‘మోటారు మోహన్‌’ అని ఆటపట్టిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌లో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఒక రోజు ఆఫీస్‌కు బస్సులో వెళ్తుండగా, చల్లగాలికి నిద్రపోయి అక్కడ కూడా గురక పెడతాడు. ‘బస్సులో వెళ్తుండగా అరగంట నీ గురక భరించలేకపోయాను. జీవితాంతం నీతో కష్టం’అని ఆ అమ్మాయి అతడిని వదిలేస్తుంది. తీవ్ర మనస్థాపానికి గురైన మోహన్‌ ఇంటికి వచ్చేస్తాడు. మరుసటి రోజు బావతో కలిసి ఓ ఇంటి వద్ద వాటర్‌ ప్యూరిఫయర్‌ రిపేర్‌ చేయడానికి వెళ్తాడు. అక్కడే అను (మీతా రఘునాథ్‌) చూస్తాడు. తల్లిదండ్రులు లేని ఆమె ఓ ఆడిటింగ్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉంటుంది. అనుతో పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఇరువురు వివాహం చేసుకుంటారు. ఫస్ట్‌ నైట్‌ రోజున మోహన్‌ గురక విషయం అనుకు తెలుస్తుంది? ఆ తర్వాత ఏం జరిగింది? మోహన్‌ గురక అతడికి ఎలాంటి కష్టాలు తెచ్చింది? మోహన్‌, అనులు కలిసి ఉన్నారా? లేక విడిపోయారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: కథానాయకుడి పాత్రకు ఏదో ఒక సమస్యను ఆపాదించి, దాని నుంచే హాస్యం పండించి విజయాలు అందుకున్న దర్శకులను మనం చూశాం. ఆ కోవకు చెందిందే ‘గుడ్‌నైట్‌’. (Good Night review in telugu) ‘గురక’ అనే సమస్యను తీసుకుని దాన్ని కథానాయకుడి పాత్రకు ఆపాదించి, ప్రేక్షకులను అలరించడంలో దర్శకుడు  వినాయక్‌ చంద్రశేఖరన్‌ విజయం సాధించారు. మోహన్‌ కుటుంబ పరిస్థితులతో పాటు, అతడికున్న గురక సమస్యను ప్రస్తావిస్తూ, నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు.  అతడి గురక వల్ల ఇంట్లో వాళ్లతో పాటు, పక్కింటివాళ్లు పడే ఇబ్బందులు. వాళ్లు చేసే కామెంట్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ‘మోటార్‌ మోహన్‌’ అంటూ ఆఫీస్‌లో అతడిని ఆటపట్టించే సన్నివేశాలు, ప్రేమించిన అమ్మాయి కాదనడం, ఇలా ప్రతి సన్నివేశం గిలిగింతలు పెడుతుంది. మోహన్‌కు అను పరిచయంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి అనుతో ప్రేమ, పెళ్లి ఇవన్నీ సాఫీగా సాగిపోతాయి. పెళ్లయిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్‌ నైట్‌ రోజున మోహన్‌ గురక గురించి తెలియడం, అక్కడి నుంచి అను నిద్రలేని రాత్రులు గడపడటం.. అతడికి చెప్పలేక ఇబ్బందులు పడటం తదితర సన్నివేశాలు చక్కని హాస్యాన్ని పంచుతాయి. అదే సమయంలో భర్తను నొప్పించలేక ఒక సగటు మహిళ పడే ఆవేదననూ దర్శకుడు హృద్యంగా చూపించాడు.

నిద్రలేమి కారణంగా అను అనారోగ్యానికి గురైన తర్వాత మోహన్‌లో మార్పు వస్తుంది. తన భార్యకు ఇబ్బంది కలగకూడదని పక్క గదిలోకి వెళ్లిపడుకుంటే మనవాడి గురకకు పెంచుకునే కుక్క పిల్ల కూడా పారిపోతుంది. (Good Night Movie review in telugu) దీంతో ఎలాగైనా గురక సమస్యను పోగొట్టుకోవాలని యూట్యూబ్‌ చూసి మోహన్‌ పడే అవస్థలు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. ఒక దశ వరకూ ఇలాంటి సన్నివేశాలు బాగుంటాయి కానీ, అలాంటి వాటినే పునరావృతం చేయడం, ఆ సమస్య వల్ల అను, మోహన్‌ల మధ్య దూరం పెరగడంతో కథ నెమ్మదిగా సాగుతుంది. దీనికి దర్శకుడు ఎలా ముగింపు ఇస్తాడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, మళ్లీ ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్‌ సీన్స్‌తో కథను ఇంకాస్త స్లో చేసేశాడు దర్శకుడు. దాదాపు ఓ 20 నిమిషాల పాటు కథలోని అన్ని పాత్రల మధ్య అదే సంఘర్షణ వాతావరణం ఉంటుంది. సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి అను, మోహన్‌ పాత్రలు. కానీ, కలిసి ఉంటేనే ఏ బంధమైనా నిలుస్తుందని చెబుతూ సాగే పతాక సన్నివేశాలు భావోద్వేగాలను పంచుతాయి. ఇరువురు మధ్య సాగే ఆ సంభాషణలు ఎంటర్‌టైనింగ్‌గా కూడా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఒక క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ చూడాలనుకుంటే, ‘గుడ్ నైట్‌’ మంచి ఆప్షన్‌. (Good Night Movie review in telugu) డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కాదు. అందరూ చిన్న నటులే. సినిమా మొత్తంలో పట్టుమని పది పాత్రలు కూడా ఉండవు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలో జీవించారు. గురక సమస్యతో బాధపడే యువకుడిగా మణికందన్‌ చక్కగా నటించాడు. బాగా తెలిసిన నటుడైతే ఆ పాత్ర అంతగా పండేది కాదేమో. అనుగా నటించిన మీతా రఘునాథ్‌ కూడా అంతే. పతాక సన్నివేశాల్లో ఇద్దరి నటనా మెప్పిస్తుంది. భార్య తన గురక వల్ల ఇబ్బంది కలగకూడదని ఆమెకు ఇయర్‌ బడ్స్‌లాంటివి కొని ఇస్తాడు. అప్పుడు మోహన్‌ ఒక డైలాగ్‌ చెబుతాడు. ‘పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు చిన్నగానే ఉంటాయి కదా’ అంటాడు. అది ప్రతి ఒక్కరి జీవితానికి వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో పుట్టిన ఏ ప్రాణి అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండదు. అలాగే ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. సమస్యను చూసి పారిపోవడం కన్నా, దాన్ని పరిష్కారం ఆలోచిస్తే జీవితంలో ఏదీ సమస్యగా కనిపించదు. అంతర్లీనంగా దర్శకుడు ఇచ్చిన ఈ సందేశం బాగుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఓకే. సినిమా నిడివి దాదాపు 2 గంటా 20 నిమిషాలు..  ఇంకాస్త కత్తిరించవచ్చు. బహుశా తమిళ నేటివిటీకి అనుగుణంగా అలా ఉంచేశారమో. ద్వితీయార్ధంలో కథాగమనం నెమ్మదిగా సాగుతుంది. దర్శకుడు వినాయక్‌ చంద్రశేఖరన్‌ సగటు కుటుంబాల్లో ఎదురయ్యే ఒక సాధారణ సమస్యను తీసుకుని, దాని చుట్టూ చక్కని హాస్య సన్నివేశాలు రాసుకుని వినోదాన్ని పంచడంలో సక్సెస్‌ అయ్యారు.

  • బలాలు
  • + పాత్రలు
  • + హాస్యం
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే ద్వితీయార్ధం
  • - నిడివి
  • చివరిగా: ‘మోటార్‌ మోహన్‌’ గురకతో నవ్విస్తాడు!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని