Project K: ‘ప్రాజెక్ట్‌ కె’లో కమల్‌ హాసన్‌

ప్రభాస్‌.. అమితాబ్‌ బచ్చన్‌.. దీపిక పదుకొణె.. ఇలా భారీ తారాగణంతో ‘ప్రాజెక్ట్‌ కె’ ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు మరో అదనపు ఆకర్షణ తోడైంది.

Updated : 26 Jun 2023 13:58 IST

ప్రభాస్‌ (Prabhas).. అమితాబ్‌ బచ్చన్‌.. దీపిక పదుకొణె (Deepika Padukone).. ఇలా భారీ తారాగణంతో ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఇందులో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) భాగమవుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. కమల్‌ చిత్రసీమలోకి అడుగు పెట్టి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రాజెక్ట్‌ కె’ బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకుంది. దీనిపై కమల్‌ మాట్లాడుతూ.. ‘‘50ఏళ్ల క్రితం నేను డ్యాన్స్‌ అసిస్టెంట్‌, సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వినీదత్‌ పేరు పెద్దగా వినిపించింది. 50 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి వస్తున్నాం. ఈ సినిమాని కొత్తతరం బ్రిలియంట్‌ దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. నా సహనటులు ప్రభాస్‌, దీపిక కూడా ఆ తరం వారే. నేను ఇంతకుముందు అమితాబ్‌తో కలిసి పని చేశాను. అయినా ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. ఆయన లాగే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఈ ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ప్రేక్షకులు నన్ను ఏ స్థానంలో ఉంచినా.. నా తొలి స్వభావం నేను సినిమా అభిమానిని. మా దర్శకుడు నాగ్‌అశ్విన్‌ విజన్‌తో మన దేశం, సినిమా ప్రపంచమంతా ప్రశంసలు మారుమోగుతాయని నేను కచ్చితంగా చెబుతున్నా’’ అన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణాలివి. కమల్‌హాసన్‌ లాంటి దిగ్గజ నటుడితో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నా కల నెరవేరింది’’ అన్నారు. నిర్మాత అశ్వినీదత్‌ మాట్లాడుతూ.. ‘‘కమల్‌ హాసన్‌తో పని చేయాలన్న నా కల.. ‘ప్రాజెక్ట్‌ కె’తో సాకారమైంది. కమల్‌, అమితాబ్‌ వంటి ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి పని చేయడం ఏ నిర్మాతకైనా గొప్ప క్షణం’’ అన్నారు. ‘‘ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన కమల్‌ సర్‌తో కలిసి పని చేయడం గౌరవంగా ఉంది. ఆయన ఈ చిత్రంలోకి వచ్చి మా ప్రపంచాన్ని పూర్తి చేయడానికి అంగీకరించినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాం’’ అన్నారు నాగ్‌అశ్విన్‌. ఈ సినిమాలో కమల్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ బహు భాషా చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని