Kareena Kapoor: సీత కోసం రూ.12 కోట్లు డిమాండ్‌.. స్పందించిన కరీనాకపూర్‌

రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం తాను రూ.12 కోట్లు డిమాండ్‌ చేశానంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బాలీవుడ్‌ అగ్రకథానాయిక కరీనాకపూర్‌ (Kareena Kapoor) స్పష్టతనిచ్చారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’...

Published : 04 Aug 2022 16:14 IST

ముంబయి: రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం తాను రూ.12 కోట్లు డిమాండ్‌ చేశానంటూ వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని బాలీవుడ్‌ అగ్రకథానాయిక కరీనాకపూర్‌ (Kareena Kapoor) స్పష్టతనిచ్చారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె సోషల్‌మీడియాలో జరుగుతోన్న ప్రచారాలపై స్పందించారు. తన సోషల్‌మీడియా ఖాతాలు చూసుకోవడానికి పీఆర్‌లంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరని వెల్లడించారు. తాను సోషల్‌మీడియాలో చాలా తక్కువగా అందుబాటులో ఉంటానని అన్నారు. ‘‘నేను సోషల్‌మీడియాలో అంత చురుగ్గా ఉండను. నాకంటూ ఒక కుటుంబం, పిల్లలు, మిత్రులు ఉన్నారు. వారితోనే సమయం గడిచిపోతుంది. వీలున్నప్పుడు మాత్రమే సోషల్‌మీడియా చూస్తుంటా’’ అని ఆమె అన్నారు.

అనంతరం ‘‘రామాయణం’ సినిమాలో సీత పాత్ర పోషించేందుకు మీరు రూ.12 కోట్లు డిమాండ్‌ చేశారంట కదా?’’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘ ఆ సినిమాలో నాకెలాంటి ఆఫర్‌ రాలేదు. ఆ పాత్రకు నన్ను అనుకోలేదు. అలాంటప్పుడు నేనెలా డిమాండ్‌ చేస్తా. ఇటువంటి వార్తలు ఎలా బయటకు వస్తాయో నాకర్థం కావడం లేదు. ఈ డిజిటల్‌ యుగంలో అసత్య ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. వాళ్లు మాట్లాడుకోవడానికి ఏదో ఒక టాపిక్‌ ఉండటం కోసం కొంతమంది ఇటువంటి వార్తలు సృష్టిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు.. మా పని మేము చేసుకోవాలా? లేదా ఇలాంటి వార్తలకు సమాధానాలిచ్చుకొంటూ కూర్చొవాలా? అనిపిస్తుంటుంది’’ అని కరీనా చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని