#KrishnaRama: రివ్యూ: #కృష్ణారామా.. వృద్ధులు ‘ఫేస్‌బుక్‌’ బాట పడితే?

సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘#కృష్ణారామా’. నేరుగా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Updated : 23 Oct 2023 19:00 IST

చిత్రం: #కృష్ణారామా; నటీనటులు: రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, రచ్చ రవి, జెమిని సురేశ్‌, రవి వర్మ తదితరులు; ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ; సినిమాటోగ్రఫీ: రంగనాథ్‌ గోగినేని; మ్యూజిక్‌: సునీల్‌ కశ్యప్‌; నిర్మాతలు: వెంకట కిరణ్‌, హేమ మాధురి; స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, స్టోరీ, డైరెక్షన్‌: రాజ్‌ మాదిరాజు; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌.

వెండితెరతోపాటు ప్రతివారం ఓటీటీ వేదికల్లోనూ కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది. అలా ‘దసరా’ సందర్భంగా ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో విడుదలైన తాజా చిత్రం ‘#కృష్ణారామా’ (#KrishnaRama). రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad), గౌతమి (Gautami) ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మాదిరాజు రూపొందించిన సినిమా ఇది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా ఉందంటే? (#KrishnaRama Review)..

కథేంటంటే: రామతీర్థ అలియాస్‌ రామ (రాజేంద్ర ప్రసాద్‌), కృష్ణవేణి అలియాస్‌ కృష్ణ అన్యోన్యంగా జీవిస్తుంటారు.వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరికి ముగ్గురు సంతానం కాగా అంతా విదేశాల్లో స్థిరపడతారు. పిల్లలకు దూరంగా ఉంటున్నామనే బాధతోనే విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. నెలలో ఒక్కరోజు వీడియో కాల్‌ ద్వారా వారితో ముచ్చటిస్తుంటారు. మళ్లీ ఆ సమయం ఎప్పుడొస్తుందోనని ఆశగా ఎదురుచూస్తుంటారు. అలా నెలలో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజూ పిల్లలతో టచ్‌లో ఉండేందుకు ఈ రిటైర్డ్‌ టీచర్స్‌ ప్రీతి (అనన్య శర్మ) సాయంతో సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఫేస్‌బుక్‌ ఖాతా తెరుస్తారు. #KrishnaRama (#కృష్ణారామా) పేరుతో తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా షేర్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న వారికి.. ఒకరి నుంచి ఒకరు విడిపోయే పరిస్థితి వస్తుంది. ఆత్మహత్యకూ ప్రయత్నిస్తారు. వారెందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అసలు పిల్లల విషయంలో వారి లక్ష్యం నెరవేరిందా, లేదా? అసలు వారికి, ప్రీతికి సంబంధమేంటి? వీటన్నింటికీ సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (#KrishnaRama Review).

ఎలా ఉందంటే: పిల్లలకు దూరంగా ఉండే తల్లీదండ్రుల బాధ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించే చిత్రమిది. టెక్నాలజీ గురించి తెలియకపోయినా, దాన్ని నేర్చుకునే ఓపిక లేకపోయినా పిల్లల కోసం ఏదైనా చేస్తామని నిరూపించే రామతీర్థ, కృష్ణవేణిల సాహసం ఇది. కుటుంబ బంధాలతోపాటు సామాజిక అంశాలనూ తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను ఆలోచింపజేశారు దర్శకుడు రాజ్‌. కృష్ణారామా సూసైడ్‌కు సిద్ధపడే ఫస్ట్‌షాట్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రామతీర్థ, కృష్ణవేణిల ఒంటరితనం, పిల్లలకు దగ్గరకావాలని వారు పడే తపన, అందుకు ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచే ప్రయత్నం తదితర సన్నివేశాలు ప్రథమార్ధంలో కీలకం. ఫొటో స్టూడియోకి వెళ్లి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు దిగడం, ఫేస్‌బుక్‌ మేనేజరుకు లేఖ రాయడం.. ఇలా వారు చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. ఖాతా తెరిచిన తర్వాత.. నెట్టింట పాపులరైన కంటెంట్‌ను రీక్రియేట్‌ చేసిన సీన్‌ మెప్పిస్తుంది. పక్కింటి అమ్మాయిలా ఉండే ప్రీతి పాత్ర ఆకట్టుకుంటుంది. ఇలా కథను సరదాగా నడిపిస్తూనే కొంచెం సీరియస్‌ టచ్‌ ఇచ్చి ఇంటర్వెల్‌ను తీర్చిదిద్దడం బాగుంది. దాంతో, ద్వితీయార్థంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంటుంది (#KrishnaRama Review).

ఫస్టాఫ్‌ను వినోదాత్మకంగా రూపొందించిన దర్శకుడు సెకండాఫ్‌ను పూర్తిస్థాయిలో సీరియస్‌గా మలిచారు. ఈ క్రమంలో.. ‘పిల్లల కోసం సోషల్‌ మీడియాలోకి వచ్చిన కృష్ణారామా దారి తప్పారు’ అని ప్రేక్షకుడు ఫీలయ్యే అవకాశం లేకపోలేదు. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెనింగ్‌ తర్వాత కృష్ణారామా, వారి పిల్లల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలను మరింత బలంగా చూపించాల్సింది. ఓ అమ్మాయి హత్యాచారానికి గురవడం, పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం.. ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా ఇప్పటికే కొన్ని చిత్రాలొచ్చాయి. ఈ పరిణామాలను కథలో భాగం చేసి సోషల్‌ మీడియా పాత్ర ఎలా ఉంటుంది? దాని ద్వారా వ్యక్తిగత జీవితం ఎలా ప్రభావితమవుతుందో కృష్ణారామా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే, అక్కడక్కడా సాగదీత అనిపిస్తుంది. కీలక ఘట్టాల సమయంలో ఓ బ్యాండ్‌ తెరపై కనిపిస్తూ బుర్రకథ తరహాలో ప్రదర్శనలివ్వడం కొత్త అనుభూతి పంచుతుంది. సంతృప్తికర ముగింపు ఇచ్చారు. కొనసాగింపునకు స్కోప్‌ ఉన్న కథ ఇది (#KrishnaRama Review).

ఎవరెలా చేశారంటే: రామతీర్థలాంటి పాత్రలు రాజేంద్ర ప్రసాద్‌కు కొట్టిన పిండిలాంటివి. తండ్రి పాత్రలో ఆయన మరోసారి సత్తా చాటారు. కృష్ణవేణిలో పాత్రలో గౌతమి ఒదిగిపోయారు. ఈ ఇద్దరి నటనే సినిమాకు ఓ బలం. అనన్య శర్మ పాత్ర నిడివి తక్కువే అయినా కీలకం. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, జెమిని కిరణ్‌, రచ్చ రవి, రవి వర్మ తదితరులు సందర్భానుసారం తెరపై కనిపించి ఆకట్టుకుంటారు.

సాంకేతికంగా ఎలా ఉంది: గతంలో ‘రుషి’, ‘ఆంధ్రాపోరి’, ‘గ్రే: ది స్పై హూ లవ్డ్‌ మీ’ తదితర చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌ ‘#కృష్ణారామా’తో అటు పెద్దలు, ఇటు పిల్లలకు కనెక్ట్‌ అయ్యే సజ్జెక్ట్‌ను బాగా డీల్‌ చేశారు. ‘మీది యంత్రాంగం అయితే మాది మంత్రాంగం’లాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. కీలక సన్నివేశాలకు సంబంధించి సునీల్‌ కశ్యప్‌ అందించిన ‘కృష్ణారామా’ బీజీఎం (నేపథ్య సంగీతం) అలరిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో రంగనాథ్‌ గోగినేని పనితనం కనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో జునైద్‌ సిద్ధిఖీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: పక్కింటి వారితో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడా అసభ్యతకు తావులేదు. పండగ సెలవును ఓ మంచి సినిమా చూస్తూ ఆస్వాదించాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.

  • బలాలు
  • + రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి నటన
  • + ప్రథమార్ధం
  • + ఇంటర్వెల్‌ ట్విస్ట్‌
  • బలహీనతలు
  • - ద్వితీయార్ధంలో అక్కడక్కడా సాగదీత 
  • చివరిగా: #కృష్ణారామా.. అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటారు (#KrishnaRama Review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని