Cinema News: కలయిక ఖాయమయ్యేనా!

అభిమాన కథానాయకులకు సంబంధించిన కొత్త చిత్రాలు వస్తున్నాయంటే చాలు.. సినీప్రియుల్లో దానికి సంబంధించిన చర్చలు మొదలైపోతుంటాయి.

Updated : 19 Nov 2023 11:58 IST

అభిమాన కథానాయకులకు సంబంధించిన కొత్త చిత్రాలు వస్తున్నాయంటే చాలు.. సినీప్రియుల్లో దానికి సంబంధించిన చర్చలు మొదలైపోతుంటాయి. అందులో కనిపించే కథానాయికలెవరు? ప్రధాన పాత్రల్లో ఏ స్టార్లు కనువిందు చేయనున్నారు? అంటూ ఆరాలు మొదలైపోతాయి. తెర వెనుక సంప్రదింపులు మొదలవడానికి ముందే పరిశీలనలో ఉన్న తారల పేర్లు చర్చనీయాంశమవుతూ సినిమాపై అంచనాలు పెంచుతుంటాయి. ఇక ఈ కలయికలే ఖాయమయ్యాయంటే ఆ అంచనాలు మరింత రెట్టింపవుతుంటాయి. ప్రస్తుతం తెలుగులో ఇద్దరు హీరోల సినిమాలు ఇలాంటి వార్తలతోనే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 


బాలకృష్ణ 109లో దుల్కర్‌!

‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడీ జోష్‌లోనే తన 109వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను దుల్కర్‌ సల్మాన్‌ పోషించనున్నారని సమాచారం. ఆ పాత్ర కథలో ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. దుల్కర్‌ ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలతోనే ‘లక్కీ భాస్కర్‌’ అనే సినిమా చేస్తున్నారు. దీన్ని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు.


చరణ్‌కు జోడీగా?

‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాత రామ్‌ చరణ్‌ చేయనున్న తదుపరి చిత్రం ఇప్పటికే ఖాయమైంది. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ స్థాయిలో మెరిసిన బుచ్చిబాబు సానాతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే కథానాయికగా సాయిపల్లవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రా రస్టిక్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ కథకు తగ్గట్లుగానే నాయిక పాత్ర కూడా ఉండనుంది. అందుకే ఇలాంటి పాత్రను సాయిపల్లవితో చేయిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచన చేసినట్లు తెలిసింది. అయితే సంప్రదింపులు మొదలయ్యాయా? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌తోనూ ఓ చిత్రం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని