Manoj Bajpayee: ఆ రోజులు గుర్తొస్తే.. ఒళ్లు పులకిస్తుంది: మనోజ్‌ బాజ్‌పేయి

భారతీయ సినీ పరిశ్రమలో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయే చిత్రం ‘సత్య’. అప్పటిదాకా గ్లామర్‌ డాళ్‌గా పేరున్న ఊర్మిళలోని నటనా కోణాన్ని ఆవిష్కరించింది ఈ సినిమా.

Updated : 05 Jul 2023 14:13 IST

భారతీయ సినీ పరిశ్రమలో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయే చిత్రం ‘సత్య’. అప్పటిదాకా గ్లామర్‌ డాళ్‌గా పేరున్న ఊర్మిళలోని నటనా కోణాన్ని ఆవిష్కరించింది ఈ సినిమా. భికూ మాత్రే రూపంలో బాలీవుడ్‌కి ఒక మంచి నటుడిని పరిచయం చేసింది. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (RGV) సినిమాని తెరకెక్కించిన విధానం, పాత్రల్ని మలిచిన తీరుతో విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అందులో ఓ కీలకమైన పాత్ర పోషించిన నటుడు మనోజ్‌ బాజ్‌పేయి (Manoj Bajpayee) ఆనాటి జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకున్నారు.

  • ‘సత్య’ను నేను బాలీవుడ్‌లో ఒక గేమ్‌ ఛేంజర్‌గా అభివర్ణిస్తుంటాను. ఇది పరిశ్రమ ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చేసింది. సినీ జనాలు, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి పంచింది. దీంతోనే సినిమా రూపకర్తలు సినిమాని జనం కోణం నుంచి చూడటం మొదలైంది. కల్పిత కథలు, హీరోల హీరోయిజం ప్రదర్శించే మూస నుంచి పక్కకు జరిగి.. నిజమైన వ్యక్తులు, వాస్తవిక కథాంశాల వెంట పరుగులు పెట్టడం మొదలైంది. గ్యాంగ్‌స్టర్‌ కథల ట్రెండ్‌ పెరిగింది.
  • ప్రతి వ్యక్తి జీవితం సినిమాల్లో చూపినట్టు గొప్పగా, ఒకేరకంగా ఉండదు. చీకటి కోణాలుంటాయి. ఉత్తానపతనాలు కనిపిస్తుంటాయి. అదే మనిషి జీవితం అంటే. ఆ వాస్తవికతను కళ్లకు కట్టినట్టు చూపించింది ‘సత్య’. దాంతోపాటు సృజనాత్మకత, వాస్తవికత, కొత్తదనం.. అన్నీ ఉండటంతోనే ఈ చిత్రం జనాలకు బాగా నచ్చింది.
  • ఈ సినిమా విడుదలైన వారం దాకా థియేటర్లలో జనమే లేరు. బాగుంది అనే నోటి మాటతో ప్రచారం మొదలయ్యాక ఒక్కసారిగా ప్రేక్షకులు పోటెత్తారు. రెండో వారం నుంచి అన్ని సినిమా హాళ్లలో హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టేశారు. ‘సత్య’ 25 వారాలపాటు ఏకధాటిగా ఆడింది. ఆ సమయంలో సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్న అతి తక్కువ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
  • ‘సత్య’ భారీ విజయం సాధించాక కొన్ని పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. పరిశ్రమలో మంచి గౌరవం దక్కింది. పెద్ద పెద్ద ఆఫీసుల్లో అడుగు పెట్టగలిగాను. నిజం చెప్పాలంటే ఈ సినిమా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మొదటి సినిమాకే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఈ విషయం నాకు మా సెక్రెటరీ భాస్కర్‌శెట్టి చెప్పాడు. నాకు నమ్మకం కలగపోతే వెంటనే ‘న్యూస్‌ చూడు’ అన్నాడు. ఆ సమయంలో నా జీవితంలో పెద్ద కల నెరవేరినట్టు అనిపించింది.
  • ఈ కాలం ప్రేక్షకులకు సైతం నచ్చే చిత్రమిది. ఇప్పటికీ ఎంతోమంది ఇందులో నా నటనపై పొగడ్తలు కురిపిస్తూనే ఉంటారు. అప్పటి సినిమా మేకింగ్‌, సంగీతం, నటన, దర్శకత్వం గుర్తొస్తుంటే.. ఒళ్లు పులకించపోతుంది. నేను గతంలో బిహార్‌లో ఉన్నప్పుడు కొందరు రౌడీలు, నేరస్థులను గమనిస్తూ ఉండేవాడిని. దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఎంతో పరిశోధన చేసి అండర్‌వరల్డ్‌ డాన్‌ల గురించి తెలుసుకున్నారు. ఆ విషయాలన్నీ నాకు చెబుతుండేవారు. వాటన్నింటినీ గుర్తు చేసుకుంటూ భికూ మాత్రే పాత్రకి సంసిద్ధమయ్యాను.
  • 1998 జులై 3న విడుదలైన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి టైటిల్‌ పాత్ర పోషించగా.. ఊర్మిళా, సౌరభ్‌ శుక్లా, షెఫాలీ షా, మకరంద్‌ దేశ్‌పాండే, పరేశ్‌ రావల్‌ కీలక పాత్రలు పోషించారు. వర్మ స్వయంగా నిర్మించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని