Tollywood: కొలతలేసుకొని తీసిన సినిమా కాదు

‘‘స్వతహాగా మాస్‌ సినిమాల్ని ఇష్టపడతాను. నేను పనిచేసిన దర్శకులది కూడా మాస్‌ శైలి. అందుకే పక్కా మాస్‌ కథతోనే తొలి సినిమా చేశా’’ అన్నారు రమేష్‌ కడూరి.

Updated : 01 Apr 2023 07:11 IST

‘‘స్వతహాగా మాస్‌ సినిమాల్ని ఇష్టపడతాను. నేను పనిచేసిన దర్శకులది కూడా మాస్‌ శైలి. అందుకే పక్కా మాస్‌ కథతోనే తొలి సినిమా చేశా’’ అన్నారు రమేష్‌ కడూరి. ‘మీటర్‌’తో పరిచయం అవుతున్న దర్శకుడాయన. కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా... క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పిస్తోంది. చిత్రం ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ  సందర్భంగా దర్శకుడు రమేష్‌ కడూరి శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘మీటర్‌ అంటే కొలత. ఇందులో హీరోయిజానికి ఓ కొలత ఉంటే... భావోద్వేగాలది మరో కొలత. ప్రేమకూ ఓ కొలత ఉంది. అందుకే ఆ పేరు పెట్టాం. వినోదం, యాక్షన్‌ అంశాలు కలగలిసిన సినిమా ఇది. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు, సంఘర్షణ ఆకట్టుకుంటుంది. కిరణ్‌ అబ్బవరం ఇప్పటివరకు చేయని కథ, పాత్రలు ఇందులో ఉంటాయి. ప్రథమార్ధంలో హాస్యానికి పెద్ద పీట వేశాం. ద్వితీయార్ధంలో భావోద్వేగాలు హత్తుకుంటాయి. అలాగని ఇదేమీ కొలతలేసుకుని తీసిన సినిమా కాదు. ఈ కథ అలా కుదిరింది. విభిన్నంగా ఉంటూనే... అసలు సిసలు వాణిజ్య సినిమా అనిపిస్తుంది’’.

‘‘నేను ఇదివరకు బాబీ, గోపీచంద్‌ మలినేని దగ్గర పనిచేశా. వాళ్ల ప్రభావం నాపైన చాలా ఉంటుంది. నాకు నచ్చిన మాస్‌ అంశాలతోనే  ‘మీటర్‌’ కథ తయారు చేసుకుని,  కొంతమంది హీరోల్ని సంప్రదించా. అయితే వాళ్లు చేయల్సిన ప్రాజెక్ట్‌లు ఉండటంతోపాటు, ఇతరత్రా కొన్ని కారణావల్ల కుదరలేదు. ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ విడుదలైంది. మా నిర్మాతలు ఆ సినిమా చూశాక, నా కథకి తనైతే బాగుంటుందని చెప్పడంతో వెళ్లి కథ చెప్పా. ఆయనకి కూడా నచ్చి సినిమా చేశారు. కథకి కోరుకున్నది సమకూరుస్తూ నిర్మాతలు గొప్ప సహకరాన్ని అందించారు. భవిష్యత్తులో కూడా మాస్‌ కథలతోనే ప్రయాణం చేస్తా’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని