Bangarraju: థ్యాంక్స్‌ ఇప్పుడు కాదు..సక్సెస్‌ మీట్‌లో చెప్తా: నాగార్జున

‘‘బంగార్రాజు’ చిత్రానికి పనిచేసిన వారందరికీ థ్యాంక్స్‌ ఇప్పుడు చెప్పను. సినిమా సక్సెస్‌ మీట్‌లో చెబుతా’’ అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. తన తనయుడు, నటుడు నాగ చైతన్యతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘బంగార్రాజు’.

Published : 09 Jan 2022 21:36 IST

హైదరాబాద్‌: ‘‘బంగార్రాజు’ చిత్రానికి పనిచేసిన వారందరికీ థ్యాంక్స్‌ ఇప్పుడు చెప్పను. సినిమా సక్సెస్‌ మీట్‌లో చెబుతా’’ అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. తన తనయుడు నాగ చైతన్యతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మ్యూజికల్‌ నైట్‌ వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకని నిర్వహించటం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు, అభిమానులందరినీ ఆహ్వానించలేకపోయాననే బాధ ఉంది. కొవిడ్‌ నిబంధల వల్ల ఎక్కువమందిని పిలిచేందుకు అనుమతి లభించలేదు. ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అనుమతి కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాం. జనవరి 14 మాకెంతో ప్రత్యేకమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రారంభమైంది ఆ రోజే. ఇదే సీజన్‌లో 50 ఏళ్ల క్రితం ‘దసరా బుల్లోడు’ చిత్రంతో నాన్న (అక్కినేని నాగేశ్వరరావు) దుమ్మురేపారు. చిత్ర బృందానికి థ్యాంక్స్‌ ఇప్పుడు కాదు సక్సెస్‌ మీట్‌లో చెప్పాలనుంది. ఎందుకంటే.. ఈ సినిమా విషయంలో అంత నమ్మకంతో ఉన్నా. సినిమా విజయంలో సగభాగం సంగీతానిదే. సంగీత దర్శకుడు అనూప్‌కి ఆ విజయాన్ని ఇచ్చేశాం. పాటల రచయితలు మంచి సాహిత్యం అందించారు. నటులం వస్తుంటాం, పోతుంటాం కానీ సాహిత్యం శాశ్వతమైంది. మీరు ఎంత ఊహిస్తున్నారో అంతకుమించి ఉంటుంది ఈ సినిమా. జనవరి 11న ట్రైలర్‌ విడుదలకానుంది’’ అని తెలిపారు.

నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘మనం’ చిత్రానికి ఇలాంటి వేడుక నిర్వహించాం. మళ్లీ ఇన్నేళ్లకు ‘బంగార్రాజు’ సినిమాకు నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆడియోను పెద్ద హిట్‌ చేసిన శ్రోతలందరికీ చాలా చాలా థ్యాంక్స్‌. ప్రస్తుతం.. ఏదైనా సినిమాలోని ఓ పాట హిట్‌ అయితే చాలు ఆ సినిమా ఓపెనింగ్స్‌, కలెక్షన్లు.. అన్నీ మారిపోతున్నాయి. అలాంటిది అనూప్‌ ఈ సినిమాకు అన్నీ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ప్రతిపాటా విడుదలైన క్షణాల్లోనే వైరల్‌ అయింది. అనూప్‌.. దర్శకుడు, నటుల సలహాలు తీసుకుని కథకు తగ్గట్టు మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాడు. అన్నపూర్ణ స్టూడియో సంస్థలో అనూప్‌ పనిచేసిన ప్రతి సినిమా విజయం అందుకుంది. ‘బంగార్రాజు’ కూడా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది. పాటల రచయితలు, గాయకులకు కృతజ్ఞతలు. నిజంగా ఇది పండగలాంటి సినిమా. ఇందులో నాకు బంగారంలాంటి క్యారెక్టర్‌ ఇచ్చినందుకు దర్శకుడు, నాన్నకి థ్యాంక్స్‌. చిన్న బంగార్రాజు పాత్రతో ప్రేక్షకులకి మరింత దగ్గరవుతాననుకుంటున్నా’’ అని అన్నారు.

కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలోని ‘బంగారా’ పాట నన్నెంతగానో ఆకట్టుకుంది. అది నాలోని డ్యాన్సర్‌ను పరిచయం చేసే తొలి పాట. మధుప్రియ ఈ పాటను బాగా పాడింది. భాస్కరభట్లగారు మంచి సాహిత్యం అందించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అద్భుతం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు సుశాంత్‌, సుమంత్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష, గేయ రచయితలు కాసర్ల శ్యామ్‌, భాస్కరభట్ల రవికుమార్‌, బాలాజీ, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని