Popcorn: సాహసం చేసినందుకు గర్వపడుతున్నా

‘‘విభిన్నమైన సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘పాప్‌కార్న్‌’ కూడా తప్పకుండా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున.

Updated : 05 Jan 2023 06:50 IST

‘పాప్‌కార్న్‌’ వేడుకలో అవికాగోర్‌

‘‘విభిన్నమైన సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘పాప్‌కార్న్‌’ (Popcorn) కూడా తప్పకుండా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున (Nagarjuna). ఆయన ముఖ్య అతిథిగా బుధవారం హైదరాబాద్‌లో ‘పాప్‌కార్న్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. అవికాగోర్‌ (Avikagor), సాయిరోనక్‌ జంటగా నటించిన చిత్రమిది. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. అవికా స్క్రీన్‌ క్రియేషన్స్‌తో కలిసి భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు. ఎం.ఎస్‌.చలపతిరాజు సమర్పకులు. ఫిబ్రవరి 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్‌ విడుదల అనంతరం నాగార్జున మాట్లాడుతూ  ‘‘పదేళ్ల ముందు బ్రెజిల్‌లో రియో నగరానికి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు అవికాగోర్‌ నటించిన ‘చిన్నారి పెళ్లికూతురు’ ధారావాహికని అనువాదం చేసుకుని చూస్తున్నారు. ఆ తర్వాత 128 దేశాల్లో ఆ ధారావాహికని అనువదించారని తెలిసింది. అవికా పాన్‌ ఇండియా కాదు, పాన్‌ వరల్డ్‌ స్టార్‌. మేం తనతో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాని నిర్మించాం. తను కథానాయికగానే కాదు, నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఈ సినిమాలో ఆమె హావభావాలు, ఉత్సాహం మామూలుగా లేదు. లిఫ్ట్‌లో సాగే విభిన్నమైన సినిమా ఇది. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. అవికాగోర్‌ మాట్లాడుతూ ‘‘నేను చేసిన ప్రతి సినిమాపైనా తెలుగు ప్రేక్షకులు ప్రేమాభిమాల్ని కురిపించారు. ఆ ప్రోత్సాహం వల్లే ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా ఓ భాగమైనప్పుడు సాహసం చేస్తున్నావని హెచ్చరించారు చాలామంది. ఇప్పుడు ఆ సాహసం చేసినందుకు గర్వపడుతున్నా. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన మంచి చిత్రమిది. లిఫ్ట్‌లోనే సన్నివేశాలు, పాటలు చేయాల్సి వచ్చింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత  బెజవాడ ప్రసన్నకుమార్‌, ఛాయాగ్రాహకుడు అజయ్‌తోపాటు, మయాంక్‌, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని