ఆట ఇంకా మొదలు కాలేదు మిత్రులారా: మాధవన్‌

తమిళ సినీ కథానాయకుడు ఆర్‌. మాధవన్‌.. డబ్బింగ్‌ చిత్రాలతో, ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో నటించి తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. దేశ విదేశాల్లో విద్యనభ్యసించి.. ప్రతిభగల విద్యార్థిగా పేరు తెచ్చుకున్న మాధవన్‌ తాజాగా సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల ఫలితాల గురించి

Published : 18 Jul 2020 00:09 IST

విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే ట్వీట్‌ చేసిన హీరో

చెన్నై: తమిళ సినీ కథానాయకుడు ఆర్‌. మాధవన్‌.. డబ్బింగ్‌ చిత్రాలతో, ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో నటించి తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. దేశ విదేశాల్లో విద్యనభ్యసించి.. ప్రతిభగల విద్యార్థిగా పేరు తెచ్చుకున్న మాధవన్‌ తాజాగా సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల ఫలితాల గురించి ప్రస్తావిస్తూ విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ట్వీట్‌ చేశారు. తనకూ బోర్డు పరీక్షల్లో తక్కువ మార్కులే వచ్చాయని, ఆట ఇంకా మొదలు కాలేదంటూ విద్యార్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

గత బుధవారం సీబీఎస్‌ఈ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. పరీక్షల ఫలితాలు విద్యార్థులపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంటాయి. మంచి మార్కులు వచ్చిన వారి గురించి పక్కన పెడితే.. తక్కువ మార్కులు వచ్చి, ఫెయిల్‌ అయ్యే విద్యార్థులు మనస్తాపానికి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ఆర్‌. మాధవన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘బోర్డు పరీక్షల ఫలితాలు పొందిన వారందరికి నా అభినందనలు. ముఖ్యంగా అంచనాలకు మించి ఫలితాలు సాధించిన వారికి. ఇక మిగతా వారికి నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. బోర్డు పరీక్షల్లో నా స్కోరు కేవలం 58శాతమే. ప్రియమైన మిత్రులారా.. ఆట ఇంకా మొదలు కాలేదు’’అని ట్వీట్‌ చేశారు. ఫన్నీ ఎమోజీలతో, తన చిత్రంలోని ఓ ఫొటోను జత చేశారు. మాధవన్‌ స్ఫూర్తివంతమైన ట్వీట్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. తమకు బోర్డు పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ చేస్తున్నారు. బోర్డు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా.. మాధవన్‌ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చదివారు. ఆ తర్వాత పబ్లిక్‌ స్పీకింగ్‌లో పీజీ పూర్తి చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాణించారు. దేశవిదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చిన మ్యాడీ.. ఆ తర్వాత మోడలింగ్‌ వైపు.. అటు నుంచి సినిమాల్లోకి వచ్చారు. 

మాధవన్‌ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. మరోవైపు తన స్వీయదర్శకత్వంలో ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ కూడా లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని