Indian 2: సెట్లో సేనాని

వీరశేఖరన్‌ సేనాపతి.. అవినీతి అధికారుల పాలిట సింహస్వప్నం. ఆ పాత్రలో ‘భారతీయుడు’గా 27ఏళ్ల క్రితం కమల్‌హాసన్‌ చేసిన సందడి సినీప్రియుల్ని మెప్పించింది.

Updated : 08 Nov 2023 14:23 IST

వీరశేఖరన్‌ సేనాపతి.. అవినీతి అధికారుల పాలిట సింహస్వప్నం. ఆ పాత్రలో ‘భారతీయుడు’గా 27ఏళ్ల క్రితం కమల్‌హాసన్‌ చేసిన సందడి సినీప్రియుల్ని మెప్పించింది. అందుకే ఇప్పుడీ సేనాపతిని ‘భారతీయుడు 2’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు శంకర్‌. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ కథానాయిక. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం కమల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ వర్కింగ్‌ స్టిల్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు శంకర్‌. అందులో కమల్‌.. సేనాపతి లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించారు. ‘‘సేనాపతిని తిరిగి తీసుకురావడానికి మీతో మళ్లీ పని చేసే అవకాశం రావడం అద్భుతం. మీరు మమ్మల్ని అలరిస్తూనే ఉంటారని.. మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను’’ అని ఆ స్టిల్‌కు శంకర్‌ ఓ వ్యాఖ్యను జోడించారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే వారం నుంచి మొదలు కానుందని సమాచారం. రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో విజయవాడ, వైజాగ్‌ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. దీనికి అనిరుధ్‌ సంగీతమందిస్తుండగా.. ఆర్‌.రత్నవేలు, రవి వర్మ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని