Tollywood: అగ్రతారల ఆధిపత్యమెంత?

2023కి వీడ్కోలు పలికి.. 2024కు స్వాగతం పలికేందుకు మరో ఇరవై రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో బాక్సాఫీస్‌ పద్దును సరిచూసుకునేందుకు చిత్రసీమ సమాయత్తమైంది. ఈ పద్దులో తొలి పేజీ అగ్ర తారలదే.

Updated : 11 Dec 2023 09:33 IST

2023కి వీడ్కోలు పలికి.. 2024కు స్వాగతం పలికేందుకు మరో ఇరవై రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో బాక్సాఫీస్‌ పద్దును సరిచూసుకునేందుకు చిత్రసీమ సమాయత్తమైంది. ఈ పద్దులో తొలి పేజీ అగ్ర తారలదే. వీరి జోరు ఈ ఏడాదంతా కనిపిస్తూనే ఉంది. సంక్రాంతి మొదలు.. దీపావళి వరకు అగ్ర కథానాయకుల చిత్రాలు సీజన్ల వారీగా సందడి చేశాయి. ఇందులో కొన్ని భారీ విజయాలతో బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించగా.. మరికొన్ని అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. మరి ఈ ఏడాది ఎవరికి తీపి గుర్తుగా మిగిలింది.. ఎవరికి చేదు ఫలితాన్ని అందించింది? తెలుసుకుందాం పదండి..

చిత్రసీమను బలంగా నిలబెట్టడంలో అగ్రతారల చిత్రాలే కీలకంగా నిలుస్తుంటాయి. బాక్సాఫీస్‌ లెక్కలు మార్చాలన్నా.. రికార్డుల మోత మోగించాలన్నా.. హౌస్‌ఫుల్‌ బోర్డులతో థియేటర్లను కళకళలాడించాలన్నా అగ్ర కథానాయకుల సినిమా బరిలోకి దిగాల్సిందే. ఏటా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూనే ఈసారి కూడా సంక్రాంతి నుంచే బాక్సాఫీస్‌ ముందు అగ్రజుల ఆధిపత్యం మొదలైంది. ఈసారి పండగ బరిలో తొలుత కాలు మోపిన కథానాయకుడిగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన ‘వీరసింహారెడ్డి’గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి.. మాస్‌ యాక్షన్‌ హంగామాతో థియేటర్లలో విజిల్స్‌ కొట్టించారు. భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌కు నూతనోత్తేజాన్ని అందించారు. ద్వితీయార్ధంలోనూ ఆయన ఇదే జోరును కొనసాగిస్తూ ‘భగవంత్‌ కేసరి’గా దసరాకి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడీ విజయోత్సాహంలోనే తన 109వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అగ్ర కథానాయకుడు చిరంజీవికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆయన గతేడాదిలాగే ఈసారి కూడా రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేసి విజయాన్ని అందుకోగా.. ద్వితీయార్ధంలో ‘భోళా శంకర్‌’తో చేదు ఫలితాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విజయమే లక్ష్యంగా ఓ సోషియో ఫాంటసీ కథాంశంతో సెట్స్‌పై ముస్తాబవుతున్నారు. ‘మెగా 156’ వర్కింగ్‌ టైటిల్‌తో వశిష్ఠ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది.

పవన్‌ కల్యాణ్‌ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. ఈ ఏడాదంతా వరుస సినిమాలతోనూ సెట్స్‌పై తీరిక లేకుండా గడిపారు. కానీ, వాటిలో నుంచి ఒక్క చిత్రమే బాక్సాఫీస్‌ ముందుకొచ్చింది. అదే సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ‘బ్రో’. ఇందులో కాలస్వరూపుడిగా పవన్‌ చేసిన సందడి అభిమానుల్ని మెప్పించినా.. ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం పవన్‌ నుంచి ‘ఓజి’, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘హరి హర వీరమల్లు’ సినిమాలు రావాల్సి ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాలన్నీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల్ని పలకరించే అవకాశముంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపిస్తున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన సంక్రాంతి బరిలో చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో ఓ విజయాన్ని అందుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు ‘రావణాసుర’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ బాగా నిరుత్సాహ పరిచాయి. ప్రస్తుతం రవితేజ ‘ఈగల్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ జనవరి 13న థియేటర్లలోకి రానుంది.


ప్రభాస్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కేనా?

‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు కథానాయకుడు ప్రభాస్‌. అందుకే ప్రస్తుతం ఆయన నుంచి వచ్చే ప్రతి చిత్రంపైనా భారీ అంచనాలు నెలకొని ఉంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ప్రభాస్‌ నుంచి ‘ఆదిపురుష్‌’ చిత్రం బయటకొచ్చింది. కానీ, అది బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టింది. అయినా సరే ప్రభాస్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడాయన విజయమే లక్ష్యంగా ‘సలార్‌’తో అలరించేందుకు సమాయత్తమవుతున్నారు. ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రభాస్‌ మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘కల్కి 2898ఎ.డి.’ చిత్రంతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని