Sreeleela: విజ్జిపాప నాలోనే ఉంది...

యాక్టర్‌ కావాలనుకుని డాక్టర్‌ అయ్యానని చెబుతుంటారు చాలా మంది. యువ కథానాయిక శ్రీలీల అటు నటన... ఇటు వైద్య విద్యని అభ్యసిస్తూ ప్రయాణం చేస్తోంది. వైద్య సామాగ్రితో రోజూ సినిమా సెట్‌కి వెళుతోంది.

Updated : 14 Oct 2023 13:32 IST

యాక్టర్‌ కావాలనుకుని డాక్టర్‌ అయ్యానని చెబుతుంటారు చాలా మంది. యువ కథానాయిక శ్రీలీల అటు నటన... ఇటు వైద్య విద్యని అభ్యసిస్తూ ప్రయాణం చేస్తోంది. వైద్య సామాగ్రితో రోజూ సినిమా సెట్‌కి వెళుతోంది. అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళుతున్న శ్రీలీల... ఇటీవల ‘భగవంత్‌ కేసరి’లో విజ్జి పాపగా నటించింది. బాలకృష్ణ, కాజల్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీల శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

కథానాయికగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ సమయంలో కూతురుగా నటించడానికి కారణం?

ఈ విషయం గురించి చాలా మంది భయపెట్టారు. కెరీర్‌ ఆరంభంలో ఇలాంటివి చేయకూడదు అన్నారు. కథ బాగా నచ్చడంతో నేను అవన్నీ ఆలోచించకుండా ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యా. అందంగా కనిపించే పాత్రలు ఎన్నో చేస్తాం. కానీ భావోద్వేగాలకి ప్రాధాన్యం ఉన్న ఇలాంటి పాత్రలు అన్నిసార్లూ రావు. నేనొక నటిగా నిరూపించుకునేందుకు అవకాశం ఉన్న సినిమా. పైగా నేను కూతురు పాత్రలు చేయదగ్గ వయసులో ఉన్నా. ఇంకో రెండు మూడేళ్ల తర్వాత ఇలాంటి పాత్రలు చేయలేం కదా అనిపించింది.

ఈ పాత్ర ఎలా ఉంటుంది?

విజ్జి పాప ధైర్యం లేని ఓ అమ్మాయి. కానీ చలాకీగా ఉంటుంది. ‘పెళ్లిసందడి’లో నేను కొంచెం గంభీరంగా మాట్లాడే అమ్మాయిగా కనిపిస్తా. ‘ధమాకా’లో ఇంకో రకం. ఈ రెండు పాత్రలతో పోలిస్తే మరింత భిన్నంగా ఉంటుంది విజ్జి పాప పాత్ర. అనిల్‌ రావిపూడి తన స్టైల్‌ నుంచి మరో భిన్నమైన స్టైల్‌కి వచ్చి చేసిన సినిమా ఇది.

విజ్జి పాప పాత్ర మీపైన ఎలాంటి ప్రభావం చూపించింది?

నాలోనే విజ్జి పాప ఉంది. అందుకే ఈ పాత్ర నాకు అంతగా కనెక్ట్‌ అయ్యింది. బాలకృష్ణ సర్‌ని కూడా నేను సెట్‌లో ఎప్పుడూ ఓ నటుడిగా చూడలేదు. ఆయన నేలకొండ భగవంత్‌ కేసరి, నేను విజ్జిపాప. సెట్‌ నుంచి ఇంటికొచ్చాక కూడా ఆ భావోద్వేగం అలాగే కొనసాగేది. సినిమా చూశాక ఆ ప్రభావం నాపై ఎంత ఉందో ప్రేక్షకులకే అర్థం అవుతుంది. శ్రీలీల అనగానే డ్యాన్స్‌ అంటున్నారు. అది నాకు కలిసొచ్చే విషయమే అయినా... నటిగానూ నేనేంటో నిరూపించుకోవాలి కదా. ఈ సినిమాతో నాకు ఆ అవకాశం దొరికింది.

బాలకృష్ణతో కలిసి నటించారు. సెట్‌లో గడిపిన క్షణాలు, ఆయనతో ఉన్న  అనుభవాల్ని పంచుకుంటారా?

బయట ఎన్నో అభిప్రాయాల్ని విని ఓ నిర్ణయానికొస్తాం. అలా నేను తొలి రోజు బాలకృష్ణ సర్‌ని కలిసినప్పుడు భయం భయంగానే మాటలు కలిపా. కానీ ఒక్కసారి మాట్లాడాక ఆయన మనసేమిటో అర్థమైంది. ఆయన మనసుకు తగ్గట్టే బాలకృష్ణ అని పేరు పెట్టారు. చాలా స్వీట్‌ పర్సన్‌. ట్రైలర్‌లో కనిపిస్తున్న పుష్‌అప్స్‌ తీసే సన్నివేశమే తొలిరోజు చేశా. అప్పుడు అక్కడే బాలకృష్ణ సర్‌ ఉన్నారు.

నటన గురించి బాలకృష్ణ ఏమైనా సలహాలు ఇచ్చారా?

ఆయనకు అన్ని రంగాలపైనా గొప్ప పరిజ్ఞానం ఉంది. సెట్‌లో ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. నేను మెడిసిన్‌కి సంబంధించిన పరీక్షలు రాసి, ఆ రోజే సెట్స్‌కి వచ్చా. ఆయనకి విషయం చెబితే... వైద్యం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నారు. ‘మీరు మెడిసిన్‌ చేయలేదు కదా, ఇవన్నీ  మీకెలా తెలుసు’ అన్నా. బసవతారకం హాస్పిటల్‌ ఛైర్మన్‌గా పనిచేయడంతో ఆ రంగం గురించి ఆయనకి ఎంతో అవగాహన ఉంది. అలా ప్రతి రంగం గురించీ చెబుతూనే ఉంటారు. ఎప్పుడు ఎలా మసలుకోవాలో చెప్పారు. డబ్బింగ్‌ సమయంలో బాలకృష్ణ, కాజల్‌ మధ్య సన్నివేశాల్ని చూశా. చాలా బాగుంటాయి. కామెడీ నాకు బాగా నచ్చింది.

తెలంగాణ నేపథ్యంలో సాగే కథ కదా. తెలంగాణ యాస విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

తెలుగు రావాలి కానీ... ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మాట్లాడతాం. హైదరాబాద్‌లో ఉంటున్నాను కానీ, యాసపై కాస్త అవగాహన ఉంది. దర్శకుడు కూడా సలహాలు ఇచ్చారు.

ఈ సినిమాలో మీకు సవాల్‌ విసిరిన సందర్భం?

ఒక నటిగా నన్ను నేను పరీక్షించుకునేలా చేసిందీ చిత్రం. నాలోనే విజ్జి పాప ఉండటంతోనేమో... నేను సెట్లో భగవంత్‌ కేసరి చెప్పే ప్రతి మాటనీ నా హృదయానికి తీసుకుని అందుకు తగ్గట్టే నటించేదాన్ని. ‘ఆడపిల్ల  లేడీ పిల్లలా కాదు, పులి పిల్లలా వుండాల’నే ఓ సంభాషణ ఉంది. నన్నలా చూడాలనేది సినిమాలో హీరో తపన. ఆ తపనని ప్రేక్షకులు సరిగ్గా అర్థం  చేసుకోవాలంటే నేను అందుకు తగ్గట్టు నటించాలి. అలా ఈ కథతోనూ, పాత్రతోనూ పూర్తిగా కనెక్ట్‌ అయ్యి నటించా. నిజ జీవితంలో నాకు చిచ్చా అంటే మా అమ్మే. తను నా చిన్నప్పుడు అలాంటి ఎన్నో సలహాలు ఇస్తూ పెంచింది.

ఒకవైపు చదువు.. మరోవైపు సినిమా. ఈ ప్రయాణం కష్టం అనిపించడం లేదా?

నటన కాకుండా ఏదైనా చేయాలంటే పుస్తకాలు తీస్తా. డాక్టర్‌ కావాలనేది చిన్నప్పట్నుంచి నాకున్న ఓ బలమైన కోరిక. మా అమ్మమ్మ ఇంట్లో పడిపోతే ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. వైద్యుడైన మా అన్నయ్య వచ్చి చిన్నపాటి వైద్యం చేశాక కొన్ని క్షణాల్లోనే ఆమె లేచింది. అప్పుడే అనుకున్నా, నేను వైద్యురాల్ని కావాలని. ఓ సినిమాకి డేట్స్‌ ఇస్తున్నానంటే అప్పుడే ఫిక్స్‌ అయిపోతా, నేను ఇక నుంచి రాత్రిళ్లు లేచి చదవాల్సి ఉంటుంది అని.

నటన... డ్యాన్స్‌. ఈ రెండింటినీ మీరు చూసే కోణం ఎలాంటిది? దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు?

రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రయాణం చేయాలి. డ్యాన్స్‌ అనేది నా కల.  నేను నటన నేర్చుకున్నది నాట్యంవల్లే. చిన్నప్పటి నుంచీ నేను భరతనాట్యం డ్యాన్సర్‌ని. భరతనాట్యంలో ఓ కథ చెప్పాలంటే హావభావాలతోనే చెబుతుంటాం. అలా అభినయం నాకు అలవాటైంది. అయితే నాట్యంలో కొన్ని హావభావాలు గంభీరంగా ఉంటాయి. కానీ సినిమా నటనకి వచ్చేసరికి ప్రతిచోటా ఎక్కువ హావభావాలు పనికి రావు. కొన్నిసార్లు ముఖంలో ఎలాంటి హావభావం లేకపోయినా ఓ భావం వస్తుంది. ఇలా ప్రతి సినిమాతోనూ నేర్చుకుంటున్నా. దర్శకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా నటిస్తుంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని