Chiranjeevi: వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నా: చిరంజీవి

‘తెలుగుదనానికి నిర్వచనం, నిలువెత్తు నిదర్శనం మన వెంకయ్యనాయుడుగారు. తెలుగువారంతా మరింత గర్వించేలా ఆయన రాష్ట్రపతి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు.

Published : 18 Nov 2021 01:59 IST

హైదరాబాద్‌: ‘తెలుగుదనానికి నిర్వచనం, నిలువెత్తు నిదర్శనం మన వెంకయ్యనాయుడుగారు. తెలుగువారంతా మరింత గర్వించేలా ఆయన రాష్ట్రపతి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. యోధ లైఫ్‌లైన్‌ డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి వెంకయ్యనాయుడుతో కలిసి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) ద్వారా తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు.. వెంకయ్యనాయుడు తెలుగుదనానికి నిర్వచనం, నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అలాంటి ఆయన్ను రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నా. ఇది నా కోరిక మాత్రమే కాదు తెలుగువారందరిదీ’ అని తెలిపారు. ‘ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌ రాజ్‌కుమార్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్‌ హార్ట్‌ సమస్యతోనే మరణించారు. పునీత్‌ సోదరుడూ ఇదే సమస్యతో బాధపడి కోలుకున్నారు. జీన్స్‌ ద్వారా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. చిన్న వయసులోనే పునీత్‌ చనిపోయారన్న విషయం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి’ అని సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దర్శకుడు రాఘవేంద్రరావు, అజారుద్దీన్‌, పుల్లెల గోపీచంద్‌, ద్రోణవల్లి హారిక అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడి చేతుల మీదుగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు యోధ లైఫ్‌లైన్‌ డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ యాజమాన్యం రూ.25 లక్షలు విరాళంగా అందజేసింది.

latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని