Koratala Siva: షాట్‌ రెడీ అయ్యాక కాల్‌ చేస్తా.. సెట్‌కి రండి..!

కోటీశ్వరులు కావాలనుకునే సామాన్యుల కలలను నిజం చేస్తూ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతోన్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా..

Published : 22 Sep 2021 02:13 IST

ఎన్టీఆర్‌కు కొరటాల శివ రిక్వెస్ట్‌

హైదరాబాద్‌: కోటీశ్వరులు కావాలనుకునే సామాన్యుల కలలను నిజం చేస్తూ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతోన్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో తాజాగా ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ సందడి చేశారు. గెలుచుకున్న మొత్తాన్ని రామకృష్ణ మఠానికి అందించాలనే మంచి ఉద్దేశంతో గేమ్‌ ప్రారంభించిన దర్శకులిద్దరూ రూ.25 లక్షలు గెలుపొందారు. కాగా, షోలో భాగంగా ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

తమ కిష్టమైన కార్టూన్‌ సిరీస్‌ల గురించి చెప్పమని ఎన్టీఆర్‌ కోరగా టామ్‌ అండ్‌ జెర్రీ అంటే ఇష్టమని దర్శకులిద్దరూ సమాధానమిచ్చారు. అనంతరం ఎన్టీఆర్‌ సైతం తనకి చిన్నప్పటి నుంచి టామ్‌ అండ్‌ జెర్రీ అంటే అమితమైన అభిమానమని.. ఇప్పటికీ సమయం దొరికినప్పుడు ఆ కార్టూన్‌ని చూస్తానని అన్నారు. తన పిల్లలు భార్గవ్‌, అభయ్‌లు ఇవేమీ చూడరని.. యాక్షన్‌ తరహా కార్టూన్స్ చూస్తారని.. ఎప్పుడైనా ఇంట్లో నిద్రపోతుంటే.. అభయ్‌ వచ్చి ముఖంపై కొట్టి అక్కడి నుంచి పారిపోతాడని ఎన్టీఆర్‌ చెప్పి నవ్వులు పూయించారు. దీనిపై స్పందించిన కొరటాల శివ.. ‘నిజమే పిల్లల అభిరుచి మారిపోయింది. ఇదే విషయమై మొన్న చిరంజీవి సార్‌ నాతో మాట్లాడారు. ఆయన సోఫాలో నిద్రపోతుంటే ఆయన మనవరాలు వచ్చి నుదిటిపై కొట్టి పారిపోయింది అంట. తర్వాత ఆయన ఐస్‌ బ్యాగ్‌ పెట్టుకున్నారట’ అని అన్నారు.

సమయపాలనను తారక్‌ చాలా అద్భుతంగా పాటిస్తారని ప్రశంసించిన శివ షూటింగ్‌ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘అందరికంటే ముందు తారక్‌ సెట్‌లోకి వచ్చేస్తారు. సమయపాలనను ఆయన చాలా చక్కగా ఫాలో అవుతారు. ఒక్కొసారి నా కారు కూడా ఓవర్‌టేక్‌ చేసి మరీ ఆయన సెట్‌లోకి వస్తారు. తారక్‌.. త్వరలో మన కొత్త సినిమా పట్టాలెక్కనుంది. సెట్‌ కూడా మీ ఇంటి పక్కనే వేయిస్తున్నాను. షాట్‌ రెడీ కాగానే ఫోన్‌ చేస్తాను మీరు అప్పుడు సెట్‌కి రండి’ అని శివ నవ్వులు పూయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని