Updated : 11 Nov 2021 22:33 IST

Tollywood:ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: దసరా, దీపావళి పండగలతో వరుస సినిమాలు థియేటర్‌లో సందడి చేశాయి. బాక్సాఫీస్‌ వద్ద వాటి టాక్‌ ఎలా ఉన్నా, కరోనా కారణంగా సినిమాలు లేక అల్లాడుతున్న సినీ ప్రియుల దాహాన్ని కాస్త తీర్చాయి. ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. అవేంటో చూసేద్దామా!

ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కార్తికేయ

కార్తికేయ(karthikeya) హీరోగా సరిపల్లి తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘రాజా విక్రమార్క’(raja vikramarka). ఆదిరెడ్డి, రామారెడ్డి నిర్మించారు. తాన్య రవిచంద్రన్‌ కథానాయిక. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సుధాకర్‌ కోమాకుల కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 12న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను చూస్తుంటే యాక్షన్‌, వినోదానికి పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ఇందులో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కనిపించారు. హోం మినిస్టర్‌ను ఓ ప్రమాదం నుంచి తప్పించడం కోసం అతను ఓ సీక్రెట్‌ మిషన్‌ చేపట్టడం.. ఈ క్రమంలో హోంమంత్రి కూతురుతో ప్రేమలో పడటం లాంటి సన్నివేశాల్ని ట్రైలర్‌లో చూపించారు. మరి విక్రమ్‌ తన మిషన్‌ను, ప్రేమను సాధించాడా? ఈ క్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? వాటినెలా ఎదుర్కొన్నాడు? అన్నది తెరపై చూడాలి. ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందించారు.


ఆనంద్‌ దేవరకొండకు భార్య కష్టాలు..!

ఆనంద్‌ దేవరకొండ(Anand Deverakonda)కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం ‘పుష్పక విమానం’(Pushpaka Vimanam). గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన కథానాయిక. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్‌(ఆనంద్‌ దేవరకొండ) అనే స్కూల్‌ టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అసలు సుందర్‌ భార్య నిజంగానే వెళ్లిపోయిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రామ్‌ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. సునీల్‌, నరేశ్‌, హర్షవర్థన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ‘కురుప్’

దుల్కర్‌ సల్మాన్‌(dulquer salmaan) హీరోగా నటిస్తూ.. స్వయంగా   నిర్మించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కురుప్‌’(Kurup). శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ తెరకెక్కించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇందులో కురుప్‌, గోపీకృష్ణన్‌ అనే రెండు విభిన్న కోణాల్లో దుల్కర్‌ కనిపించనున్నారు. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్‌ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రిమినల్‌ అయిన కురుప్‌ను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు అతడు వేసే ప్లాన్లతో విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరి గోపీకృష్ణన్‌.. కురుప్‌గా ఎందుకు మారాడు? పరిస్థితుల ప్రభావమా? పోలీసులు ఆయన్ను పట్టుకున్నారా? అసలు సుకుమార కురుప్‌ జీవితం ఏంటి? తెలియాలంటే నవంబర్‌ 12న థియేటర్‌లో విడుదల కానున్న ఈ సినిమా చూడాల్సిందే.


కేసీఆర్‌ బయోపిక్‌ ‘తెలంగాణ దేవుడు’

శ్రీకాంత్‌(Srikanth) ఉద్యమ నాయకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీశ్‌ వడత్యా తెరకెక్కిస్తున్నారు. మొహహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మిస్తున్నారు. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడు. బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, వెంకట్‌, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 12న థియేటర్లలో విడుదల కానుంది. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనేది కళ్లకు కట్టినట్లు చూపించాం. ఈ తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు.


‘కోటికొక్కడు’ కథేంటి?

కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌(kiccha sudeep) కథానాయకుడిగా శివ కార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం ‘కె3’. కోటికొక్కడు.. అన్నది ఉపశీర్షిక. శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు. మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధా దాస్‌, ఆషిక కథానాయికలు. ఈ చిత్రం నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో  సుదీప్‌ రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. ఓవైపు మాస్‌గా కనిపిస్తూనే.. మరోవైపు స్టైలిష్‌ యాక్షన్‌తోనూ అలరించేందుకు సిద్ధమయ్యారు.


‘ట్రిప్‌’ అతనిలో మార్పు తెచ్చిందా?

ఆమని, గౌతమ్‌ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ట్రిప్‌’. దుర్గం రాజమౌళి నిర్మిస్తున్నారు. ‘‘ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం. పోస్టర్‌కు తగ్గట్లుగానే కథనం రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉంది’’ అని దర్శక నిర్మాతలు  తెలియజేశారు. మరి ఈ ట్రిప్‌ కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నవంబరు 12న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. కార్తిక్‌ కొడకండ్ల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


ఓటీటీలో రాబోతున్న చిత్రాలు

పాయల్‌ రాజ్‌పుత్‌, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్‌ ‘3 రోజెస్‌’. ప్రముఖ దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. మగ్గీ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ నవంబర్‌ 12 నుంచి ఆహా వేదికగా ప్రసారం కానుంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు.. ఒకేచోట కలిసి స్నేహితులయ్యాక.. వాళ్ల కథలు ఎటు మలుపు తిప్పాయి. అస్సలు సమాజంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనే ఆసక్తికర అంశంతో ఈ సిరీస్‌ తెరకెక్కినట్లు తెలుస్తోంది.


జీ5

* అరణ్మణై 3(తమిళం) నవంబరు

* స్క్వాడ్‌ (హిందీ) నవంబరు12

డిస్నీ+ హాట్‌స్టార్‌

* డోప్‌ సిక్‌(వెబ్‌సిరీస్‌) నవంబరు12

* హోమ్‌ స్వీట్‌ హోమ్‌ ఎలోన్‌(హాలీవుడ్‌) నవంబరు12

* జంగిల్‌ క్రూయిజ్‌(హాలీవుడ్‌)నవంబరు12

* కనకం కామిని కలహం(మలయాళం)నవంబరు12

* షాంగ్‌-చి(హాలీవుడ్‌)నవంబరు12

* స్పెషల్‌ ఆప్స్‌(వెబ్‌సిరీస్‌) నవంబరు12

నెట్‌ఫ్లిక్స్‌

* రెడ్‌నోటీస్‌ (హాలీవుడ్‌) నవంబరు 12

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని