Published : 06/11/2020 00:39 IST

నేలపై నుంచి.. మిషిగన్‌ శాసనసభకు

భారత సంతతి వ్యక్తి శ్రీ థానేదార్‌ ప్రయాణం

హ్యూస్టన్‌: మిషిగన్‌ రాష్ట్రం నుంచి డెమొక్రటిక్‌ పార్టీ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికైన భారత సంతతి కుబేరుడు శ్రీ థానేదార్‌. 15 డాలర్ల కనీస వేతనం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత నినాదాలుగా ఆయన ఈ విజయం సాధించారు. ఈయనకు భార్య శశి థానేదార్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 65 ఏళ్ళ థానేదార్‌.. విజయవంతమైన వ్యాపార వేత్త, శాస్త్రవేత్త, రచయిత కూడా. తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డీ-3 జిల్లా నుంచి 93 శాతం ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన శ్రీ.. రెండు సంవత్సరాల క్రితం గవర్నర్‌ పదవికి పోటీచేసి ఓటమిని చవిచూశారు. ‘‘శ్రీ ఫర్‌ వీ’’ (శ్రీ కోసం మనం) అంటూ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించిన నాటి ఎన్నికల్లో.. 10 మిలియన్‌ డాలర్ల సొంత ధనాన్ని ఖర్చు చేశారు. నిరాశ, వెనుతిరగటం అనేది ఎరుగని తన ప్రయాణాన్ని ఆయన పలు సందర్భాల్లో  వివరించారు.

15 డాలర్ల వేతనంతో..

శ్రీ థానేదార్‌ కర్ణాటకలోని బెల్గామ్‌ ప్రాంతానికి చెందిన వారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లను యూనివర్సిటీ ఆఫ్ బొంబాయి నుంచి పూర్తిచేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం 1979లో అమెరికాకు వచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్రాన్‌, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌ నుంచి పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1984లో పెట్రోలైట్‌ కార్ప్‌లో పరిశోధకుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. థానేదార్‌కు 1988లో అమెరికా పౌరసత్వం లభించింది. వారాంతాల్లో గంటకు 15 డాలర్ల వేతనంతో వివిధ ల్యాబ్‌లలో పనిచేస్తూ.. వ్యాపార మెళకువలు నేర్చుకున్నారు. బ్యాంకు రుణం తీసుకుని తాను పనిచేసిన చెమీర్‌ లేబొరేటరీస్‌నే కొనుగోలు చేశారు. 1991లో కేవలం ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభించి చెమీర్‌ను పదిహేనేళ్లలో ఏడాది 16 మిలియన్ల లాభాలను ఆర్జించే స్థాయికి తీసుకొచ్చారు. వ్యాపారవేత్తగా, రాజకీయంగా కూడా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు.

భారత్‌లో మారని స్థితిగతులు

భారత్‌లో ప్రజల నిరాశ నిస్పృహలను తాను గమనించానని.. సంవత్సరాలు గడిచినా ఇక్కడి పరిస్థితుల్లో ఏ మార్పు లేదన్నారు.  ఇక్కడి ప్రజలను ఎవరూ పట్టించుకోరని థానేదార్‌ విచారం వ్యక్తం చేశారు. నేలపై కూర్చుని తిని, నేలపైనే నిద్రించిన రోజులు తన చిన్నతనంలో ఎన్నో ఉన్నాయన్నారు. భారత్‌లో సరైన నీటి సదుపాయం కూడా లేని ఇంట్లో ఉన్నప్పటి పరిస్థితిని ఆయన గుర్తు చేసుకున్నారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన తనకు పేదరికంలో ఉన్న బాధలు తెలుసన్నారు. తన 14 ఏళ్ల వయసులో తన తండ్రి తప్పనిసరి పరిస్థితుల్లో పదవీ విరమణ చేయాల్సి వచ్చిందని.. ఎనిమిది మంది ఉన్న కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు రకరకాల పనులు చేసానని శ్రీ తెలిపారు.

సవాళ్లను ఎదుర్కొంటూ

ఈసారి ఎన్నికల ప్రచారాన్ని తాను కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభం కాకముందు నుంచే ప్రారంభించానని శ్రీ తెలిపారు. ఇక కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు తదితర అత్యవసర వస్తువులను ఉచితంగా అందజేశానని ఆయన వివరించారు. తన జిల్లాలో పంట నష్టం, నీటి సమస్యలు, మూసివేతలు, నేరాలు, నిరుద్యోగం తదితర సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనగలననే నమ్మకాన్ని ఈ సందర్భంగా థానేదార్‌ వ్యక్తం చేశారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని