వ్యాక్సినేషన్‌ పూర్తయితే.. అమెరికా వెళ్లొచ్చు

పూర్తిస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారికి అమెరికా శుభవార్త అందించింది. భారత్‌ సహా వివిధ దేశాల నుంచి వచ్చే ఇలాంటి అంతర్జాతీయ ప్రయాణికులపై నిబంధనలను ఎత్తివేసింది. ఈనెల 8

Updated : 06 Nov 2021 10:52 IST

8 నుంచి నిబంధనల ఎత్తివేత

డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన టీకాలకు ఆమోదం

వాషింగ్టన్‌/దిల్లీ: పూర్తిస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారికి అమెరికా శుభవార్త అందించింది. భారత్‌ సహా వివిధ దేశాల నుంచి వచ్చే ఇలాంటి అంతర్జాతీయ ప్రయాణికులపై నిబంధనలను ఎత్తివేసింది. ఈనెల 8 నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ఈమేరకు తాజాగా ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ప్రయాణికులకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగానికి అనుమతించిన, యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదించిన టీకాలను తీసుకున్నవారిని అమెరికాలోని ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)’ అనుమతిస్తోంది. అయితే వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు ప్రయాణానికి ముందు 3 రోజుల్లోపల చేయించుకున్న కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలో ‘నెగెటివ్‌’ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. టీకాలు తీసుకోనివారిలో.. అమెరికా పౌరులు, చట్టబద్ధంగా శాశ్వత నివాసం పొందిన వారు (ఎల్‌పీఆర్‌లు) లేదా కొద్ది సంఖ్యలో అనుమతించిన విదేశీయులు మాత్రం అమెరికాకు బయల్దేరేందుకు ఒక రోజు ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కాని పిల్లలకు (మైనర్లు) సంబంధించి మాత్రం.. ప్రయాణాల్లో వారి పెద్దలకు అమల్లో ఉన్న నిబంధనలే వీరికీ వర్తిస్తాయి. అమెరికా తాజా ప్రకటన ప్రకారం.. ప్రయాణికులు తమ వ్యాక్సినేషన్‌ స్థితికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలను సంబంధిత విమానయాన సంస్థలకు చూపించాల్సి ఉంటుంది. ఆయా సంస్థలు ప్రయాణికుల పేరు, పుట్టిన తేదీ వంటివన్నీ కచ్చితంగా సరిచూసుకోవాల్సి ఉంటుంది. వారు చూపిస్తున్న ఆధారాలు ఆ వ్యక్తులకు చెందినవేనా? అవి ఆయా దేశాల అధికారిక ధ్రువీకరణ పత్రాలేనా? వంటి అంశాలను నిర్ధారించుకోవాలి. ఈమేరకు టీకా తయారీ కంపెనీ, తీసుకున్న డోసులు, ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారు.. వంటి వ్యాక్సినేషన్‌ వివరాలన్నీ సీడీసీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కొవిడ్‌ పరీక్షల్లో ‘పాజిటివ్‌’ వచ్చినా.. ప్రయాణికుల వివరాలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా విమానయాన సంస్థలు అనుమతించరాదని ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని