మార్క్‌ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్‌ లేఖ

కొద్ది రోజులుగా అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య ఫేస్‌బుక్‌కు సంబంధించి తీవ్ర మాటల యుద్ధం జరుతుంది. తాజాగా భారత్‌లోని ఫేస్‌బుక్‌ సంస్థ ఉద్యోగులపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేసింది....

Published : 18 Aug 2020 19:00 IST

ఫేస్‌బుక్‌ ఇండియా డైరెక్టర్‌ పాత్రపై విచారణ చేయించాలని డిమాండ్

దిల్లీ: కొద్ది రోజులుగా అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య ఫేస్‌బుక్‌కు సంబంధించి తీవ్ర మాటల యుద్ధం జరగుతూనే ఉంది. తాజాగా భారత్‌లోని ఫేస్‌బుక్‌ సంస్థ ఉద్యోగులపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. దీనిని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ మేం కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యంలో పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష పూరిత ప్రసంగాలతో చేయాలనుకునే ఎలాంటి మార్పులను అంగీకరించబోం. నకిలీ, విద్వేష పూరిత వార్తల ప్రచారంలో ఫేస్‌బుక్ పాత్రపై వాల్‌స్ట్రీట్ జనరల్‌ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలను ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాలి’’ అని రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక లేఖలో వాల్‌స్ట్రీట్ జనరల్ పత్రిక తన కథనంలో పేర్కొన్నట్లు ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్‌ (పబ్లిక్‌ పాలసీ) ఆంఖీ దాస్‌తో పాటు దీనితో సంబంధం ఉన్న వ్యక్తుల పాత్రపై విచారణ చేపట్టాలని జుకర్‌బర్గ్‌ను కాంగ్రెస్‌ కోరింది. దానికి సబంధించిన నివేదికను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేసింది. భాజపాతో సహా అనుబంధ సంస్థలకు అనుకూలంగా భారత్‌లో ఫేస్‌బుక్‌ వ్యవహరిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ నెల 14న ఒక వార్తా కథనం వెలుగులోకి వచ్చింది. ఇది భాజపా-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. ఈ నేపథ్యంలో తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఆంఖీ దాస్‌ దిల్లీ సైబర్‌ క్రైం విభాగానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు దిల్లీ అల్లర్లను ఎగదోయడం వెనక ఫేస్‌బుక్‌ భారతదేశ ఉన్నతాధికారి పాత్ర ఏమైనా ఉందా అనేది తెలుసుకునేందుకు ఆ సంస్థకు సమన్లు జారీ చేయాలని దిల్లీ శాసనసభా సంఘం నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని