రాహుల్‌, ప్రియాంకపై కేసు నమోదు

కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా 200 మంది కార్యకర్తలపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా భౌతికదూరం పాటించలేదని, మాస్క్‌లు కూడా ధరించకుండా

Published : 02 Oct 2020 00:44 IST

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా 200 మంది కార్యకర్తలపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా భౌతికదూరం పాటించలేదని, మాస్క్‌లు కూడా ధరించకుండా ఎపిడమిక్‌ చట్టాన్ని ఉల్లంఘించారని గౌతమబుద్ధనగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్‌, ప్రియాంకలతో పాటు 200 మందికి పైగా కాంగ్రెస్‌ కార్యకర్తలు వద్దని చెప్పినా వినకుండా హాథ్రస్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. అలాగే, దాదాపు 50 కార్లతో కాన్వాయ్‌లో వచ్చారని, ఎంత చెప్పినా వినకుండా ముందుకెళ్తుండటంతో యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద అడ్డుకున్నామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని ఆరోపించారు. ఆ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఓ ప్రమాదానికి కూడా కారణమయ్యాయని పోలీసులు తెలిపారు. 

హాథ్రస్‌ ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు రాహుల్‌, ప్రియాంక వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. పోలీసులు వారిని హాథ్రస్‌‌ వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒకానొక దశలో తోపులాట జరగడంతో రాహుల్‌ గాంధీ కింద పడిపోయారు. రాహుల్‌ గాంధీ పట్ల యూపీ పోలీసులు వ్యవహరించిన తీరును పలు విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని