కనీస మద్దతు ధర రద్దు చేయం: కిషన్‌రెడ్డి

దేశం అభివృద్ధి చెందాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థమని.. అందుకే అనేక విప్లవాత్మక మార్పులను ఆయన తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 03 Oct 2020 01:21 IST

 

హైదరాబాద్‌: దేశం అభివృద్ధి చెందాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థమని.. అందుకే అనేక విప్లవాత్మక మార్పులను ఆయన తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం బాధాకరమని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలపై భాజపా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో సోమాజీగూడలో రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డితో పాటు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర రద్దు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రైతు తనకు నచ్చిన వ్యక్తికి, నచ్చిన ధరకు పంటను అమ్ముకునే స్వేచ్ఛను నూతన చట్టాల్లో పొందుపరిచామన్నారు. దేశంలో విత్తన వ్యవస్థ బహుళజాతి సంస్థల్లో బందీ కావడానికి కాంగ్రెస్‌ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా రాకపోయుంటే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించేదన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై ఏ రైతు సంఘంతోనైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధంమని తేల్చిచెప్పారు. రైతులకు అన్యాయం చేసేవిధంగా రాజకీయ నేతలు మాట్లాడొద్దని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా హితవు పలికారు. 

చెప్పుడు మాటలు నమ్మొద్దు: లక్ష్మణ్‌

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు నష్టపోతారంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. రైతులకు న్యాయం జరగాలంటే దళారుల వ్యవస్థ పోవాలని నిపుణులు సూచించారని.. నిపుణుల సిఫార్సులకు అనుగుణంగానే కొత్త చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టాల ప్రకారం రైతులు ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చని చెప్పారు. కష్టపడి పనిచేసే అన్నదాతలకు మేలు జరిగేలా రైతు సంఘాలు వ్యవహరించాలని.. చెప్పుడు మాటలు నమ్మొద్దని లక్ష్మణ్‌ సూచించారు.

వ్యవసాయ సంక్షోభానికి కారణం పాలకులే: జేపీ

దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం పాలకులేనని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ (జేపీ) విమర్శించారు. మార్కెట్‌ యార్డుల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. డిమాండ్‌ ఉన్న చోట పంటను అమ్ముకునే సౌలభ్యం రైతుకు ఉండాలని జేపీ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెప్పారు. అయితే ఈ చట్టాలు అవసరం తప్ప.. అద్భుతాలు సృష్టించవని ఆయన అభిప్రాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని