ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి:పవన్‌

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు పంట నష్టపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 23 Oct 2020 02:10 IST

అమరావతి: ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు పంట నష్టపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని.. పరిహారాన్ని అందించడంలోనూ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని పవన్‌ ఆరోపించారు. గత ఏడాది చెల్లించాల్సిన పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. ప్రధానంగా వరి పంట నీటమునిగి కుళ్లిపోతోందని.. తక్షణమే పరిహారం చెల్లిస్తే రైతులు తదుపరి పంటకు సిద్ధం అవుతారన్నారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని పవన్‌ కోరారు. వరద ప్రభావిత జిల్లాల్లో జనసేన నాయకులు పర్యటించి పొలాలను పరిశీలిస్తారని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని