ఇది రాజకీయ బంద్‌ కాదు: శివసేన

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు భారీ మద్దతు వ్యక్తం అవుతోంది.

Updated : 09 Dec 2020 02:29 IST

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. పలు రాజకీయ పార్టీలు రైతులకు బాసటగా నిలిచాయి. రైతులకు ఐక్యతను ప్రకటించడం, వారి మనోభావాలకు అనుగుణంగా మసలుకోవడం మన కర్తవ్యమని మంగళవారం శివసేన పార్టీ పేర్కొంది. 

‘ఇది రాజకీయ బంద్‌ కాదు. ఇది మన సెంటిమెంట్‌. దిల్లీలో ఆందోళన చేస్తోన్న రైతులు ఏ జెండాను మోయడం లేదు. రైతులకు ఐక్యతను ప్రకటించడం, వారి మనోభావాలకు అనుగుణంగా మసలుకోవడం మన కర్తవ్యం. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు తావు లేదు. ఉండకూడదు కూడా. ప్రభుత్వానికి మనసుంటే, ప్రధాన మంత్రి, హోంమంత్రి..ఇద్దరిలో ఎవరో ఒకరు స్వయంగా రైతుల వద్దకు వచ్చి మాట్లాడాలి’ అని శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌ అన్నారు. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు గత 10 రోజులకు పైగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దిల్లీ శివారుల్లో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంతో జరిగిన చర్చలు విఫలం కావడం, చట్ట సవరణలకు కేంద్ర సూచించిన ప్రతిపాదనలతో సంతృప్తి చెందకపోవడంతో రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించారు. 

ఇవీ చదవండి:

రోడ్డెక్కిన రైతులు..నిలిచిన రైళ్లు

రైతులకు అమెరికా నేతల మద్దతు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని