ఈ దండలు మీ కోసమే: తేజస్వీ యాదవ్ 

మొదటి దశ పోలింగ్‌ నేపథ్యంలో బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి ఈ రోజు బ్రేక్ పడనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.

Published : 27 Oct 2020 00:53 IST

పట్నా: మొదటి దశ పోలింగ్‌ నేపథ్యంలో బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి ఈ రోజు బ్రేక్ పడనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఆర్జేడీ నేత, మహాకూటమా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్ సోమవారం ఉదయం ట్విటర్‌లో ఉల్లిగడ్డల దండతో దర్శనమిచ్చారు. కూరగాయల ధరలు సామాన్యులను బాధిస్తున్న క్రమంలో కేంద్రంపై విమర్శలు చేస్తూ ఈ ఫొటోను షేర్ చేశారు. 

‘ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. వ్యాపారాలు, ఉపాధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రైతులు, కార్మికులు, యువత, వ్యాపారులు.. వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికి  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వ్యాపారులను భాజపా చితికిపోయేలా చేసింది. అప్పుడు ఉల్లిగడ్డల ధర పెరిగినప్పుడు వారు ఆ దండలు వేసుకొని తెగ తిరిగారు. ఇప్పుడు మేం వారికి వాటిని ఇస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ..‘ఉల్లిగడ్డల ధర రూ.50 నుంచి రూ.60 మధ్యలో ఉన్నప్పుడు ధరల పెరుగుదల గురించి వారు మాట్లాడారు. ఇప్పుడు రూ.80 దాటినా వారు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు. రైతులు నాశనమవుతున్నారు. యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు. బిహార్‌ పేదరికంతో ఉంది. ప్రజలు విద్య, ఉద్యోగాలు, వైద్య సహాయం కోసం వలస పోతున్నారు. ఆకలి తీవ్ర స్థాయిలో ఉంది’ అంటూ భాజపా, ఎన్‌డీఏ కూటమిపై మండిపడ్డారు.  భారీ వర్షాలు, అవసరానికి మించి నిల్వ వంటి కారణాలతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధర రూ.100కు చేరుకొని సామాన్య ప్రజలను కన్నీరుపెట్టిస్తోంది. దాంతో దేశీయ సరఫరా పెంచి, వినియోగదారులకు ఊరట కల్పించే ఉద్దేశంతో వాటి నిల్వపై కేంద్రం పరిమితులు విధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని