MCD Elections: దిల్లీ ‘స్థానిక’ విజయం.. ఆమ్‌ ఆద్మీకి ఎందుకంత ప్రత్యేకం..?

దిల్లీ (Delhi) మున్సిపల్‌ కార్పొరేషన్(MCD Elections)ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) విజయం సాధించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ.. ఈ విజయం ఆమ్‌ ఆద్మీకి ఉత్సాహాన్నిచ్చింది.

Updated : 07 Dec 2022 16:58 IST

దిల్లీ: దిల్లీ (Delhi) మున్సిపల్ కార్పొరేషన్ (MCD)‌.. దేశ రాజధానిలోని పాలనా యంత్రాంగంలో కేవలం ఓ విభాగం మాత్రమే. కానీ ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న స్థానిక సంస్థ ఇది. అందుక్కారణం.. ఈ మున్సిపల్‌ కార్పొరేషన్‌(అంతకుముందు మూడు కార్పొరేషన్లుగా ఉండగా.. ఈ ఏడాది వీటిని విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు) ఆ మూడు కార్పోరేషన్లలో 15ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భాజపా (BJP)ను ఓడించి.. ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) జయకేతనం ఎగురవేయడమే. దిల్లీ గల్లీలో పుట్టి.. జాతీయ పార్టీగా అవతరించేందుకు సిద్ధమవుతున్న కేజ్రీవాల్‌ పార్టీకి.. ఈ గెలుపు ఓ ‘బూస్ట్‌’. మరి ఈ విజయం ఆమ్‌ ఆద్మీకి ఎందుకంత ప్రత్యేకం.. ప్రాముఖ్యం అంటే..

తొలిసారి భాజపాను గద్దెదించి..

ఒక ఎన్నికల్లో భాజపాను అధికార పీఠం నుంచి దించి ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో కొన్నిసార్లు భాజపాపై విజయం సాధించినా.. అది విశ్వాస తీర్మాన పరీక్షల్లోనే. ఇక, 2013లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గద్దెదించిన ఆప్‌.. ఆ తర్వాత అదే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌ను అధికార పీఠం నుంచి దించేసింది.

కమలనాధుల పథకం ఫలించలేదు

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు సమాంతరంగా దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(MCD Elections) ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ బరిలోకి దిగింది. కేజ్రీవాల్‌ సహా ఆప్‌ కీలక నేతలు ఆ రాష్ట్రాల ప్రచారంలోనే బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఎంసీడీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. డిసెంబరు 1, 5వ తేదీల్లో గుజరాత్‌ ఎన్నికలు జరగ్గా.. డిసెంబరు 4న ఎంసీడీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించారు. తమ పార్టీని ఇబ్బందుల్లో పడేసేందుకే భాజపా ఇలాంటి కుట్ర పన్నిందని ఆప్‌ ఆరోపించింది కూడా. అయితే ఆ ప్లాన్‌ ఫలించలేదు. ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ (Kejriwal) సహా పార్టీ కీలక నేతలు పెద్దగా ప్రచారం చేయకపోయినా.. మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది.

 జాతీయ పార్టీ దిశగా?

గుజరాత్‌ (Gujarat), హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఫలితాలకు(డిసెంబరు 8న వెలువడనున్నాయి) ఒక రోజు ముందు దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఇది ఆప్‌లో మరింత విశ్వాసాన్ని నింపింది. గుజరాత్‌లోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీ గణనీయ సంఖ్యలో ఓట్లు సాధించే అవకాశముందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అదే జరిగితే.. ఆప్‌ ‘జాతీయ’ ప్రణాళికలకు ఈ విజయాలు దోహదపడుతాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీ అవతరించింది. దశాబ్దం తిరిగే సరికి జాతీయ పార్టీ దిశగా పరుగులు పెడుతుండటం గమనార్హం.

మోదీపైనే గురిపెట్టిన కేజ్రీవాల్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనే పోటీకి దిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా గతంలో ఎన్నడూ నేరుగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయని కేజ్రీవాల్‌.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. గుజరాత్‌లో పలు ర్యాలీల్లో పాల్గొన్న ఆయన.. ప్రధాని, భాజపాను విమర్శిస్తూ ప్రచారం చేశారు. దీంతో భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మోదీ vs కేజ్రీవాల్‌ పోరు తప్పదేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు