Politics: మోదీకి పట్నాయక్‌ 8 రేటింగ్‌ ఇస్తే.. భాజపా మాత్రం నవీన్‌కు 0 ఇచ్చింది!

ఒడిశాలో అధికార బిజద, విపక్షాల మధ్య రేటింగ్‌ లొల్లి మొదలయ్యింది. మోదీకి సీఎం 8 రేటింగ్‌ ఇస్తే.. భాజపా మాత్రం నవీన్‌ పట్నాయక్‌కు సున్నా రేటింగ్‌ ఇచ్చింది.

Published : 27 Sep 2023 15:48 IST

భువనేశ్వర్‌: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఒడిశాలో అధికార బిజు జనతాదళ్‌ (BJD), భాజపా మధ్య పోటాపోటీ నెలకొంది. అయినప్పటికీ.. ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) ఇటీవల ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలో మోదీ (Narendra Modi) పనితీరుకు 10కి 8 రేటింగ్‌ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే పట్నాయక్‌పై మాత్రం రాష్ట్ర భాజపా భిన్నంగా స్పందించింది. రాష్ట్రంలో బిజద పనితీరుకు 0 రేటింగ్‌ ఇస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.

ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అనేక సందర్భాల్లో మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాసం సమయంలోనూ భాజపాకు మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌లో తాజాగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌.. ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు. విదేశీ విధానంపై మోదీ ప్రభుత్వానికి 10కి 8 మార్కులు ఇస్తున్నట్లు చెప్పిన ఆయన.. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఏపీ రాజకీయాలతో మాకేంటి సంబంధం?

రాష్ట్ర భాజపా మాత్రం నవీన్‌ పట్నాయక్‌ పాలనపై మండిపడింది. ప్రధాని మోదీ పనితీరుకు ముఖ్యమంత్రి 10 మార్కులు ఇవ్వాల్సి ఉందని విపక్ష నేత (భాజపా) జయ్‌నారాయణ్‌ మిశ్రా పేర్కొన్నారు. అయినప్పటికీ పట్నాయక్‌ పనితీరుకు మాత్రం తాను 0 రేటింగ్‌ ఇస్తున్నానని అన్నారు. మోదీ అవినీతిరహిత పాలన అందిస్తుంటే.. పట్నాయక్‌ ప్రభుత్వం మాత్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇదే వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడింది. ప్రజల కోసం రెండు పార్టీలు ఏమీ చేయలేదని.. వారికి 0 మార్కులు ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినీపతి విమర్శించారు.

అయితే, మిశ్రా, బాహినీపతి వంటి వారి రేటింగ్‌ నవీన్‌ పట్నాయక్‌కు అవసరం లేదని.. ఒడిశా ప్రజలే ఆయనకు ఫుల్‌ మార్కులు ఇస్తారని అధికార బిజద ఎమ్మెల్యే శశిభూషణ్‌ బెహేరా పేర్కొన్నారు. అందుకే ఐదు పర్యాయాలుగా ఆయనే ముఖ్యమంత్రి అవుతున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని