Akhilesh Yadav: లోక్‌సభ సభ్యత్వానికి అఖిలేశ్‌ రాజీనామా..!

యూపీలోని ఆజంగఢ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆఖిలేశ్‌, తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అందించారు.

Updated : 22 Mar 2022 20:21 IST

శాసనసభ వైపే మొగ్గుచూపిన సమాజ్‌వాదీ అధినేత

దిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఆఖిలేశ్‌ యాదవ్‌ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. యూపీలోని ఆజంగఢ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఖిలేశ్‌, తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన ఆయన.. కర్హాల్‌ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఆయన ఎంపీగా కొనసాగుతారా లేక శాసనసభలో అడుగుపెడతారా అనే విషయంపై సందిగ్ధత నెలకొన్న సమయంలో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామాకే అఖిలేశ్‌ మొగ్గు చూపారు.

మరోవైపు అఖిలేశ్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత ఆజంఖాన్‌ కూడా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్‌ అసెంబ్లీ స్థానంలో గెలుపొందిన ఆయన.. అదే (రాంపూర్‌) లోక్‌సభ స్థానాన్ని వీడేందుకు సిద్ధమయ్యారు.

ఇలా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం. ఎందుకంటే ప్రస్తుతం లోక్‌సభలో ఎస్పీ నుంచి కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోక్‌సభలో పార్టీని బలహీనపర్చొద్దని అఖిలేశ్‌ భావిస్తున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో వీరు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. శాసనసభలో ప్రతిపక్ష నేతగా శివపాల్‌ను ఎన్నుకోనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ పక్కనబెడుతూ ఎమ్మెల్యేగా కొనసాగేందుకే ఎస్‌పీ చీఫ్‌ మొగ్గు చూపారు.

ఇదిలాఉంటే, ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోగా.. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను దక్కించుకుంది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్యను పెంచుకున్న ఎస్‌పీ.. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని