యోగితో శివపాల్‌ యాదవ్‌ భేటీ.. అఖిలేశ్‌తో బంధానికి ‘ఎండ్‌’కార్డ్‌ పడినట్లేనా..?

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సమాజ్‌వాదీ పార్టీకి మరో సమస్య ఎదురైంది. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌.. ఆయన బాబాయి శివపాల్‌ యాదవ్‌ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నట్లు

Published : 01 Apr 2022 01:25 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సమాజ్‌వాదీ పార్టీకి మరో సమస్య ఎదురైంది. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌.. ఆయన బాబాయి శివపాల్‌ యాదవ్‌ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎస్పీ కూటమితో శివపాల్ బంధం తెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన భాజపాలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

అఖిలేశ్‌, శివపాల్‌ మధ్య 2016లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. శివపాల్‌ను అఖిలేశ్ తన కేబినెట్‌ నుంచి తప్పించడం.. ఆ తర్వాత శివపాల్‌ పార్టీ నుంచి విడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ ఎన్నికల్లో శివపాల్‌ సొంతంగా పోటీ చేశారు. అయితే ఇటీవల 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిద్దరూ పాత విభేదాలను పక్కనబెట్టి చేతులు కలిపారు. శివపాల్‌ తన పార్టీని ఎస్పీలో కలుపుతున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ శివపాల్‌ ఎస్పీ గుర్తుపైనే పోటీ చేశారు.

అయితే ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నూతన ఎమ్మెల్యేలు సమావేశమై అఖిలేశ్ యాదవ్‌ను శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి శివపాల్‌ యాదవ్‌ను ఆహ్వానించలేదు. ఈ విషయమై శివపాల్‌.. అఖిలేశ్‌ను ప్రశ్నించగా.. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షాలతో తాను త్వరలోనే సమావేశమవుతానని చెప్పినట్లు సమాచారం. ఇక మార్చి 24న శివపాల్‌.. అఖిలేశ్‌ను కలిసి ఎస్పీలో కీలక పాత్ర (ప్రతిపక్ష నేతగా) ఇవ్వమని కోరినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అయితే దీనికి అఖిలేశ్‌ అంగీకరించలేదు సరికదా.. ‘‘మీరు మా మిత్రపక్షం మాత్రమే. సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు కాదు’’ అని చెప్పినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలతో శివపాల్‌ అసంతృప్తికి లోనైనట్లు తెలిపాయి.

యోగితో భేటీ.. ఆంతర్యమేంటీ..?

మరోవైపు శివపాల్‌.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం లఖ్‌నవూలోని సీఎం నివాసానికి వెళ్లిన శివపాల్‌ ఆయనతో 20 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీపై శివపాల్‌ మాట్లాడనప్పటికీ.. మర్యాద పూర్వకంగానే కలిసినట్లు ఆయన పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే భాజపాలో చేరుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని