Himanta Sarma: రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం తీవ్ర వ్యాఖ్యలు!

భాజపా తరఫున ఉత్తరాఖండ్‌లో ప్రచారంలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక్కడి ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘2016లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు...

Published : 11 Feb 2022 20:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌, వ్యాక్సిన్ల గురించి రాహుల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు స్పందనగా.. తామెప్పుడైనా రాహుల్‌ పుట్టుక గురించి ప్రశ్నించామా? అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో భాజపా తరఫున ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇక్కడి ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ విమర్శలు చేశారు.

‘‘2016లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్‌ ఆధారాలు అడిగారు. రాహుల్‌ వ్యక్తిగత విషయాలపై తామెప్పుడైనా ఇలా అడిగామా? పాక్‌ భూభాగంలో సర్జికల్‌ చేపట్టారని మన సైనికులు చెబితే.. అదే ఫైనల్‌. దానికి ఆధారాలు కావాలంటూ సైన్యాన్ని ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారు’’ అంటూ హిమంత రాహుల్‌పై ధ్వజమెత్తారు. ఈ విషయంలో సైనికులను కించపరచవద్దని సూచించారు. హిజాబ్‌ వివాదంపైనా స్పందిస్తూ.. పాఠశాలలు, కళాశాలల్లో కేవలం యూనిఫాంను మాత్రమే అనుమతించాలన్నారు. ఇది విద్యార్థుల మధ్య సమానత్వాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ముస్లిం విద్యార్థినులు చదువుకొని వైద్యులు, ఇంజినీర్లు కావాలనుకుంటున్నారని.. కానీ, కాంగ్రెస్‌ మాత్రం వారు హిజాబ్ వివాదంలోనే బిజీగా ఉండాలని చెబుతోందన్నారు.

అంతకుముందు దేశ సమాఖ్యపై రాహుల్‌ గాంధీ చేసిన ఓ ట్వీట్‌పైనా హిమంత ఘాటుగా స్పందించారు. కశ్మీర్‌ నుంచి కేరళ వరకు, గుజరాత్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు భారత్‌ అన్నింటా అద్భుతమైనదంటూ రాహుల్‌ అందులో పేర్కొనగా.. పశ్చిమ బెంగాల్‌ దాటి ఈశాన్య భారతం కూడా ఉందంటూ హిమంత బదులిచ్చారు. మీ ‘తుక్డే తుక్డే ఫిలాసఫీ’కి దేశాన్ని తాకట్టు పెట్టలేమన్నారు. అసలు జాతీయతతో మీ సమస్య ఏంటని ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని