Atchannaidu: వైవీ సుబ్బారెడ్డి నోట సీఎం జగన్‌ మాట: అచ్చెన్నాయుడు

జగన్‌.. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Published : 14 Feb 2024 14:59 IST

అమరావతి: వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి నోట సీఎం జగన్‌ మాట వచ్చిందని.. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే మళ్లీ హైదరాబాద్ పాట పాడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. హైదరాబాద్‌లోని బినామీ ఆస్తుల కోసమే కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. గతంలో అమరావతి నిర్మాణానికి కనీసం 30 వేల ఎకరాలుండాలని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని జగన్‌ చెప్పినట్లు అచ్చెన్న గుర్తు చేశారు. అమరావతిని పూర్తి చేస్తామని ప్రజలను నమ్మించిన జగన్‌.. అధికారంలోకి రాగానే రాజధానిని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు.

‘‘జగన్‌.. మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. ఈ మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నారు. హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తీసుకొచ్చారు. కేవలం బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. జగన్ రెడ్డి అరాచకం స్థాయి ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూస్తే అర్థమవుతుంది. 60 రోజుల తర్వాత తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అమరావతిని పూర్తి  చేస్తాం.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపిస్తాం. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం’’ అని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని