Balineni Srinivasa Reddy: బాలినేని జనసేనకు వెళ్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి

పార్టీలో సమన్వయం కోసం పనిచేస్తున్నానని.. అందుకే గిద్దలూరు నియోజకవర్గ వైకాపా నేతలతో సమావేశం ఏర్పాటు చేశానని ఆ పార్టీ సీనియర్‌ నేత..

Updated : 10 Aug 2022 12:20 IST

ఒంగోలు: పార్టీలో సమన్వయం కోసం పనిచేస్తున్నానని.. అందుకే గిద్దలూరు నియోజకవర్గ వైకాపా నేతలతో సమావేశం ఏర్పాటు చేశానని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను జనసేనకు వెళ్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని.. అందుకే ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతల గురించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేస్తే మద్దతు ప్రకటించానని బాలినేని చెప్పారు. చేనేత కార్మికుల కోసం గతంలో చాలా కార్యక్రమాలు చేశామని.. ఇప్పడూ చేస్తున్నామని తెలిపారు. వైకాపా రీజినల్‌ కోఆర్డినేటర్‌గా 22 నియోజకవర్గాల బాధ్యతలు తనకు అప్పగించారని.. అక్కడ గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు. ఊసరవెల్లి రాజకీయాలు చేయనన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్‌ఆర్‌ అని.. ఎన్నికష్టాలు ఉన్నా సీఎం జగన్‌ వెంటే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్‌తోనే ఉంటానని.. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని