Bandi sanjay: కేఏ పాల్‌ .. కేసీఆర్‌ సొంత విమానం కొన్నది ఆ ఇద్దరే: బండి సంజయ్‌

కేసీఆర్‌ ప్రకటించిన జాతీయ పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

Published : 06 Oct 2022 16:55 IST

హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రకటించిన జాతీయ పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ ప్రారంభించిన సందర్భంలో ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారు? వారిలో ఇప్పుడు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెడుతున్నారో సీఎం కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కనీసం సొంత పార్టీ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా జాతీయ పార్టీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. భాజపాకు వ్యతిరేకంగా కుట్రలతో జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో తెరాస బండారం బయటపడుతుందనే జాతీయ పార్టీ నాటకం ఆడుతున్నారన్నారు. 

‘‘నాకు తెలిసి సొంత విమానం కొన్నది ఇద్దరే.. ఒకరు కేఏ పాల్‌ మరొకరు కేసీఆర్‌. భవిష్యత్‌లో వీళ్లిద్దరికీ అలయెన్స్‌ ఉంటుందేమో. కుమారుడిని సీఎంను చేయాలి. లిక్కర్‌ క్వీన్‌కు ఏదో విధంగా దిల్లీలో చేయూత ఇవ్వాలి అనేది కేసీఆర్‌ ఉద్దేశం. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్‌ అవినీతి చర్చకు వస్తుందనే కొత్త పార్టీ ప్రకటన. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేశారు. కానీ, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ అని పేరు మార్చారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంటే .. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి బీఆర్‌ఎస్‌ పేరుతో ఎన్నికలకు వెళ్లాలి. టీఆర్‌ఎస్‌ పేరుతో మునుగోడులో ఓటు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మనది స్వయం పాలన.. జాతీయ పార్టీ నాయకులు టూరిస్టుల్లా వచ్చి పోతుంటారు అని విమర్శలు చేశారు. టూరిస్టు మాదిరిగా కేసీఆర్‌ ఇప్పుడు ఎక్కడికి వెళతారు? జాతీయ పార్టీలు ఏం చేస్తాయన్నారు.. మరి కేసీఆర్‌ ఎందుకు జాతీయ పార్టీ పెట్టారు? మేం కట్టే పన్నులు ఎక్కువ .. ఆ స్థాయిలో కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా వచ్చే ఆదాయం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు ఇస్తారు? ఏం చేస్తారో  కేసీఆర్‌ చెప్పాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని