‘క్రిటికల్‌ రివర్‌’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి

క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 07 May 2024 04:50 IST

లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు పేరుతో రూ.వంద కోట్ల దోపిడీ
తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు. శేషిరెడ్డితో సంబంధాల వల్లే కార్డ్‌-2 అభివృద్ధికి రూ.34 కోట్లు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లో భాగంగా ప్రజల ఒరిజినల్‌ ఆస్తి పత్రాలను ఉంచేందుకు సాఫ్ట్‌వేర్‌ కోసం రూ.వంద కోట్లను జగన్‌ ప్రభుత్వం క్రిటికల్‌ రివర్‌కు కట్టబెట్టిందని విమర్శించారు. ఆ సంస్థ సోమవారం ఇచ్చిన పత్రికా ప్రకటనలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తమకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ ప్రాజెక్టు వచ్చిందని తెలిపిందని పేర్కొన్నారు. దీన్నిబట్టే ఈ ప్రాజెక్టు విలువ రూ.వంద కోట్లకుపైనే ఉందని స్పష్టమవుతోందన్నారు. ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ ఇస్తామన్న భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)ను కాదని క్రిటికల్‌ రివర్‌ కంపెనీకి కార్డ్‌-2 ప్రాజెక్టును ఎందుకు కట్టబెట్టారని నిలదీశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ప్రతిపక్షాలు, మీడియా ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆస్తి పత్రాలు ఎక్కడ, ఎవరి వద్ద ఉంటాయో చెప్పాలన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 1996 నుంచి నేటి వరకు వాడుతున్న కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (కార్డ్‌) సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసే బాధ్యతను తొలుత ఎన్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. తర్వాత ఉచితంగా చేస్తామన్న ఎన్‌ఐసీని కాదని క్రిటికల్‌ రివర్‌ నుంచి రూ.34 కోట్లకు కొనుక్కుంది’ అని విజయ్‌కుమార్‌ వివరించారు.

రూ.49 కోట్ల ఆదాయమున్న సంస్థకు రూ.వంద కోట్ల కాంట్రాక్టా?

‘క్రిటికల్‌ రివర్‌ను ఒంగోలుకు చెందిన మారం అంజిరెడ్డి స్థాపించారు. ఈ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.49 కోట్లే.  వీరు మాములు ఆడిటర్‌తోనే ఆడిటింగ్‌ చేయిస్తున్నారు. ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌, బ్యాలెన్స్‌ షీటు, లాభనష్టాల నివేదికను 2022 మార్చి వరకే స్టాక్‌ ఎక్స్ఛేంజికి సమర్పించారు’ అని విజయ్‌కుమార్‌ తెలిపారు. ‘రూ.10.47 కోట్ల నెట్‌వర్త్‌ ఉన్న ఓ అన్‌లిస్టెడ్‌ కంపెనీకి రోజుకు వేలల్లో జరిగే క్రయవిక్రయ లావాదేవీలు రికార్డు చేయడం, డిజిటలైజేషన్‌, వాటికి తగిన సైబర్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌తో భద్రత కల్పించడంలాంటి కీలకమైన ప్రాజెక్టును ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు