Bandi Sanjay: తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌ను పట్టించుకునే స్థితిలో లేరు: బండి

మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత భారాసకు లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Published : 08 Mar 2023 14:27 IST

హైదరాబాద్: మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత భారాసకు లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భారాసలో మహిళా విభాగమే లేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్సీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. తొలి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. భారాస మహిళా అధ్యక్షురాలు ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళల దినోత్సవ వేడుకల్లో సంజయ్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. ఆమె స్పందనపై విమర్శలు చేశారు. 

‘‘కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులకు, తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? విచారణకు పిలిస్తే వెళ్లి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. కోర్టులు కొడతాయా అని గతంలో కేసీఆరే అన్నారు. దర్యాప్తు సంస్థలకు, భాజపాకు ఏం సంబంధం? కాంగ్రెస్‌ హయాంలోనూ ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. కవిత వల్ల మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్, కేటీఆర్‌లు కవిత విషయంపై ఎందుకు స్పందించలేదు. సెంటిమెంట్‌ను తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు’’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని