BJP: ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి భాజపా అధిష్ఠానం పిలుపు

తెలంగాణ భాజపా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు అసంతృప్త నేతలను దిల్లీకి పిలిచి బుజ్జగించే పనిలో పడింది.

Updated : 23 Jun 2023 19:17 IST

దిల్లీ: తెలంగాణపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని దిల్లీ రావాలని ఆదేశించారు. ఈ మేరకు వీరిద్దరు ఇవాళ లేదా రేపు దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాలకు పలువురు సీనియర్లు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భాజపా కాస్త డీలా పడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి.. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిపై భాజపా అధిష్ఠానం దృష్టి పెట్టింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని దిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ భాజపా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు