BRS-BJP: భారాస ఎమ్మెల్యే ఆఫీస్‌ ముట్టడికి భాజపా యత్నం.. హనుమకొండలో ఉద్రిక్తత

హనుమకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని కోరుతూ భాజపా హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే విజయ్‌భాస్కర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన భాజపా నాయకులు, కార్యకర్తలను హంటర్‌ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 24 Aug 2023 12:59 IST

వరంగల్‌ (నేరవార్తలు): హనుమకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని కోరుతూ భాజపా హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే విజయ్‌భాస్కర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన భాజపా నాయకులు, కార్యకర్తలను హంటర్‌ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, భాజపా నాయకులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో కొంత మంది భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. అనంతరం భాజపా హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా.. ఆమె సొమ్మసిల్లి  కింద పడిపోయారు. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హనుమకొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రావు పద్మతోపాటు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎ. రాకేశ్‌రెడ్డిని నగర శివారులోని ఠాణాకు తరలించారు.

కరీంనగర్‌లో మంత్రి ఇంటి ముట్టడికి యత్నం..

మరోవైపు కరీంనగర్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌తో భాజపా శ్రేణులు.. మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనలు చేపట్టకుండా ముందస్తుగానే కొంత మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయినప్పటికీ మరికొందరు మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. వీరిని అదుపులో తీసుకునే క్రమంలో రోడ్డుపై బైఠాయించారు. కొందరు కార్యకర్తలు గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని