Lalu Yadav: శస్త్రచికిత్స అనంతరం లాలూ తొలి ప్రసంగం.. అభిమానుల్లో జోష్‌!

వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా తుడిచిపెట్టుకుపోతుందని ఆర్జేడీ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆయన తొలిసారి ప్రసంగించారు.

Published : 26 Feb 2023 01:29 IST

పట్నా: కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు భాజపా(BJP) యత్నిస్తోందని ఆర్జేడీ(RJD) అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav) ఆరోపించారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి(Kidney Transplantation) ఆపరేషన్ అనంతరం.. శనివారం ఆయన తన తొలి ప్రసంగంలో భాజపాపై విరుచుకుపడ్డారు. బిహార్‌(Bihar)లోని పూర్నియాలో నిర్వహించిన మహాగఠ్‌బంధన్‌ ర్యాలీని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. దేశంలోని బలహీనవర్గాలు, మైనారిటీలకు భాజపా, ఆర్‌ఎస్ఎస్‌(RSS)లు వ్యతిరేకమని విమర్శించారు. తమ కూటమి 2024 లోక్‌సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాను తుడిచిపెట్టేస్తుందన్నారు.

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను అంతం చేసేందుకు యత్నిస్తున్నాయని లాలూ ఈ సందర్భంగా ఆరోపించారు. ‘మా పోరాటం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతోనే. సంఘ్‌ సూచనలనే భాజపా పాటిస్తోంది' అని వ్యాఖ్యానించారు. భాజపాను అధికారం నుంచి తొలగించేందుకు బిహార్ చొరవ తీసుకుందని.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ భాజపా గల్లంతవుతుందన్నారు. ఆర్జేడీ- జేడీయూ పొత్తును చమురును నీటితో కలిపే ప్రయత్నంగా పోల్చుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించిన రోజే లాలూ ఈ మేరకు ప్రసంగించారు.

సింగపూర్‌లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం లాలూ ప్రసాద్‌ ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చారు. తాజా ప్రసంగ సమయంలో ఆయన బలహీనంగా కనిపించారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి లాలూ మాట్లాడుతూ.. ‘నేను ఈ ర్యాలీకి హాజరు కావాలనుకున్నా. కానీ, ఆరోగ్య పరిస్థితులు సహకరించలేదు. శస్త్రచికిత్స అనంతరం బాగా కోలుకుంటున్నా. మీ ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తన ఒక కిడ్నీని దానం చేసిన కుమార్తె రోహిణి ఆచార్యకి ఎప్పుడూ రుణపడి ఉంటా’ అని పేర్కొన్నారు. చాలా రోజుల అనంతరం లాలూ ప్రసంగించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని