Eknath Sindhe: 2024లో భాజపాదే విజయం.. గత రికార్డులన్నీ బ్రేక్‌ అవుతాయ్‌!: సీఎం శిందే

Eknath sindhe: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భాజపాదే విజయమని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే అన్నారు. 

Updated : 12 Jun 2023 00:12 IST

శ్రీనగర్‌: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok sabha elections) భారతీయ జనతాపార్టీ (BJP) ఘన విజయం సాధిస్తుందని మహారాష్ట్ర సీఎం, శివసేన నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో భాజపా గత రికార్డులను బ్రేక్‌ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీనగర్‌ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.  జీ20 అధ్యక్ష పదవి ఈసారి భారత్‌కు దక్కడం దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులు మన దేశానికి వస్తున్నారని చెప్పారు.  ప్రపంచం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్‌ మాత్రం 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని.. ఇదంతా మోదీ వల్లేనని చెప్పారు. 

జమ్మూలో వైష్ణోదేవి క్షేత్రాన్ని దర్శించుకొని తాను కశ్మీర్‌కు వచ్చినట్టు ఏక్‌నాథ్‌ శిందే చెప్పారు. ఈ రోజు తాను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్ సిన్హాతో సమావేశం అయినట్టు తెలిపారు. సహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని.. ఆయన తన శ్రేయోభిలాషి అని చెప్పారు. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు. జమ్మూకశ్మీర్‌లో గతంతో పోలిస్తే చాలా మార్పు కనబడుతోందని.. అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఉపాధి లభిస్తోందని,  రోడ్లు నిర్మిస్తున్నారని.. దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారని తెలిపారు.  రాజకీయ పార్టీలు జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌పై విలేకర్లు అడిగిన ప్రశ్నకు శిందే స్పందించారు. ఈ అంశంపై ప్రధాని కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గతేడాది ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమిపై ఏక్‌నాథ్‌ శిందే వర్గం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో భాజపాతో కలిసి శిందే వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని