Andhra News: సీఎం కాన్వాయ్‌కు కార్లు పెట్టుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లించకపోవడం

Updated : 13 May 2022 06:24 IST

కుప్పం: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి నిదర్శనమన్నారు. సీఎం, మంత్రులు, ప్రముఖుల కాన్వాయ్‌లకు కార్లు పెట్టిన వారికి రూ.17.5 కోట్ల బకాయిలను మూడేళ్లుగా ప్రభుత్వం బాకీ పడిన వైనంపై చంద్రబాబు స్పందించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కనీసం సీఎం కాన్వాయ్‌కు కార్లు కూడా పెట్టుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అని మండిపడ్డారు. ఈ మొత్తం అంశాన్ని ఒక శాఖలో పెండింగ్ బిల్లుల అంశంగా మాత్రమే చూడకూడదని.. ఇది రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల ధ్వంసానికి అద్దం పడుతోందని చెప్పారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ తీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మూడేళ్లుగా బిల్లులు చెల్లించకపోతే అధికారులు ఎలా కార్లు ఏర్పాటు చేశారు? బిల్లులు రాక వాహనాల యజమానులు పడే బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారు? వ్యవస్థల నిర్వీర్యంతో అధికారులు, ఉద్యోగులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనై తప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఒంగోలులో వాహనదారుడి కారును సీఎం కాన్వాయ్ కోసం తీసుకెళ్లడం వ్యవస్థ తెచ్చిన అవస్థ తప్పా మరొక్కటి కాదు. బాధ్యత లేని ప్రభుత్వం, పాలన తెలియని సీఎం ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం. పాలకుల వైఫల్యాలు అటు ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులకు కూడా శాపంలా మారుతున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎంత?పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎంత? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

జాబ్‌ క్యాలెండర్ ఏమైంది?

‘‘ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కింద రూ.12వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇస్తున్నారు. వంటనూనె, ఇతర వస్తువలు ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.330 వసూలు చేస్తోంది. జగన్‌ బటన్‌ నొక్కితే ఎవరి ఖాతాల్లో డబ్బులు పడట్లేదు. ఒకే విడతలో రూ.50 వేలు రుణమాఫీ చేసిన ఘనత తెదేపాది. రైతులకు ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఎవరికీ ఉపకారవేతనాలు రావట్లేదు. జగన్‌ చెప్పిన జాబ్‌ క్యాలెండర్ ఏమైంది? జగన్ పాలనలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అయ్యాయి. పోలీసుల అలసత్వం వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కవయ్యాయి. కొందరు పొరుగు రాష్ట్రం వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు. తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్లను సీఎం స్టాలిన్‌ తొలగించలేదు. జగన్ మాత్రం అన్న క్యాంటీన్లను తొలగించారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని