Chandrababu: తెదేపాకు విరాళాలు ఇవ్వండి.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్‌సైట్‌ను అధినేత చంద్రబాబు ప్రారంభించారు. 

Updated : 09 Apr 2024 17:22 IST

మంగళగిరి: తెదేపా విరాళాల వెబ్‌సైట్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో https://tdpforandhra.com వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి చందాగా రూ.99,999 రూపాయల విరాళాన్ని చంద్రబాబు పార్టీకి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్‌ఆర్‌ఐలకోసం వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించినట్టు చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారికి రశీదులు కూడా ఇస్తామన్నారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్‌ చాలా సులువు అవుతుందన్నారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందన్నారు.

రాష్ట్రం కోసం ఎన్‌ఆర్‌ఐలు పనిచేయాలి..

పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల దగ్గర్నుంచే తాము విరాళాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. వైకాపా గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరించిందని మండిపడ్డారు. అందుకే ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు అనుమతించాలని సమయం కోసం వైకాపా ఎదురు చూసిందని దుయ్యబట్టారు. ఎన్‌ఆర్‌ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాదు.. ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని కోరారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని వెల్లడించారు. వైకాపాకు ఓటమిపై స్పష్టత రావడంతోనే సిట్‌ కార్యాలయంలో పత్రాలు తగులబెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధం సభలకు కనీసం రూ.15 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. 420లంతా కలిసి ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఒక్క ఫోన్‌ ట్యాపింగ్‌ ఏంటి.. అన్ని తప్పుడు కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా చిత్ర విచిత్ర వేషాలేస్తారని వెల్లడించారు. ప్రతి రోజూ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కంటైనర్లలో డబ్బులు వెళ్తూనే ఉన్నాయన్నారు.

‘‘రాష్ట్ర ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో 3 పార్టీలు ముందుకు వచ్చాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. రాష్ట్రంలో ఒకే ఒక్కడు బాగుపడ్డాడు.. 5 కోట్ల మంది నష్టపోయారు.  ఎన్నికల్లో ప్రచారం ఒక భాగమైతే.. ప్రలోభాలు మరో భాగం. సంపద సృష్టించడమే కాదు.. ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు