Chandrababu: కులాల మధ్య చిచ్చుపెట్టి.. వైకాపా చలి కాచుకుంటోంది: చంద్రబాబు

సీఎం జగన్‌ కోనసీమను మరో పులివెందుల చేయాలనుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Published : 11 Apr 2024 21:59 IST

అమలాపురం: సీఎం జగన్‌ కోనసీమను మరో పులివెందుల చేయాలనుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మూడు జెండాలు వేరయినా.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. కోనసీమను బంగారు సీమగా మారుస్తామని పునరుద్ఘాటించారు. అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి వైకాపా చలికాచుకుంటోందని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని, జగన్‌ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 

‘‘రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారు. ఇప్పుడు కాపాడుకోకపోతే శాశ్వతంగా దక్కించుకోలేం. అమరావతితో మూడు ముక్కలాట ఆడారు. రాజధాని చిరునామా లేకుండా చెలగాటమాడారు. వైకాపా పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైంది. యువతకు నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌.. అప్పుల్లో నెంబర్‌ వన్‌గా మారింది. రాష్ట్రం దివాలా తీసే స్థితికి వచ్చింది. మద్యం తాకట్టు పెట్టి రూ.25వేల కోట్లు అప్పు తెచ్చారు. వైకాపా కంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. తెదేపా హయాంలో పథకాలకు బడ్జెట్‌లో 19శాతం కేటాయించాం. వైకాపా గోరంత చేసి.. కొండంత ప్రచారంతో జగన్నాటకాలు ఆడుతోంది. జగన్‌ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు. రాష్ట్రంలో సహజ వనరులు అన్నీ దోచేశారు. ప్రజల ఆస్తులపై జగన్‌ ఫొటో వేసుకుంటున్నారు. భూ పరిరక్షణ చట్టం పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. ప్రజల భూమి తాకట్టు పెట్టి ఇతరులకు బదిలీ చేసే ప్రమాదముంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పడకేసింది. బటన్‌ నొక్కి బొక్కింది ఎంత? మీవాళ్లు దోచింది ఎంత?’’ అని చంద్రబాబు నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు